రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో పాలసీ కాన్‌క్లేవ్–2026 సమావేశం
రాయదుర్గం (హైదరాబాద్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమైన గేమ్‌చేంజర్‌గా మారబోతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లోని సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్ (సీఏఎఫ్) ఆ«ధ్వర్యంలో గురువారం పాలసీ కాన్‌క్లేవ్–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలమైన, రియల్‌టైమ్ సిటిజన్ బేటాబేస్‌లను ఉపయోగించడం ద్వారా ఏఐ మధ్యవర్తులను తొలగించగలదని, అవినీతిని తగ్గించగలదని, ప్రభుత్వ సేవలు నిరంతరాయంగా సాగేందుకు అవకాశం కలుగుతోందన్నారు.
తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్ ముసాయిదా రూపకల్పనలో ఐఎస్‌బీ సహకారం గురించి ఆయన వివరించారు. రోజువారీ పాలనలో ఏఐని సజావుగా ఏకీకృతం చేయడానికి తెలంగాణను కచ్చితమైన జాతీయ నమూనాగా భావించి విద్యావేత్తలు, పరిశ్రమలు, నియంత్రణదారులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రకటించారు. ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ఐఎస్‌బీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందున వ్యాపారపద్దులు, ప్రజా విధానాన్ని తెలియ జేయడానికి, కఠినమైన విద్యా పరిశోధనలను ఉత్పత్తి చేయాలనే దాని వ్యవస్థాపక దృష్టిని కొనసాగిస్తూనే ఉందన్నారు.
ఎంఫాసిస్ మద్దతుగల కొత్త ‘ఏఐ ఫర్ ఇంపాక్ట్’చొరవను హైలైట్ చేస్తూ బలమైన ఏఐ ఆధారిత యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఫాసిస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కులకర్ణి, సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్, ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రసన్నతంత్రి పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.


