తీన్మార్‌ మల్లన్నకు రిమాండ్‌.. ఆచూకీ చెప్పాలని పోలీస్‌ స్టేషన్‌కు భార్య..

Police Remand For Q-News Teenmar Mallanna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మేడిపల్లి పీఎస్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడి చేశారన్న కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నతోపాటు మరో నలుగురిని పోలీసులు బుధవారం ఉదయం హయత్‌నగర్‌ మేజి్రస్టేట్‌ ముందు హాజరు పర్చారు. మేజిస్ట్రేట్‌ మల్లన్నతోపాటు నలుగురు వ్యక్తులకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. రాత్రి అరెస్టు చేసిన మల్లన్నను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకుచ్చారు. కాగా, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే వరకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీర్జాదిగూడలో చైన్‌ స్నాచింగ్‌ నేరాలను నిరోధించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కానిస్టేబుళ్ల వద్దకు వచ్చి ఎవరు మీరు! అని ప్రశ్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా.. వినకుండా వారిని కొట్టి, లాఠీలను లాక్కొని బలవంతంగా సమీపంలో ఉన్న క్యూ న్యూస్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆఫీసు ముందు తిరుగుతున్నారని, దీంతో అనుమానం వచ్చి తీసుకొచ్చామని కానిస్టేబుళ్ల గురించి మల్లన్నకు తెలిపారు. వారిని తన గదిలోకి తీసుకురావాలని మల్లన్న చెప్పడంతో లోపలికి తీసుకెళ్లి కానిస్టేబుళ్ల సెల్‌ఫోన్లు లాక్కొని, రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. కర్రలతో దాడి చేశారు.

ఈ విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపించారు. సీనియర్‌ పోలీసు అధికారులు కూడా క్యూ న్యూస్‌ ఆఫీసుకు చేరుకొని నిర్బంధంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షించారు. వారిని నిర్బంధించిన తీన్మార్‌ మల్లన్నతో పాటు క్యూ న్యూస్‌ ఎడిటర్‌ బండారు రవీందర్, డ్రైవర్‌ ఉప్పాల నిఖిల్, ఆఫీసు బాయ్‌ సిర్రా సుధాకర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చింత సందీప్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవటంతో పాటు అక్రమంగా బంధించడం, కర్రలతో దాడి చేయడం వంటి నేరంపై ఆ ఐదుగురిపై ఐపీసీ సెక్షన్‌ 363, 342, 395, 332, 307 ఆర్‌/డబ్ల్యూ 34, సెక్షన్‌ 7(1) కింద కేసులు నమోదు చేశారు. 

నా భర్త ఆచూకీ చెప్పండి..
ఇదిలా ఉండగా తన భర్త ఆచూకీ చెప్పాలని తీన్మార్‌ మల్లన్న భార్య మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ వెళ్లిన ఆమె, తన భర్తను ఎందుకు అరెస్ట్‌చేశారని, ఎక్కడికి తీసుకువెళ్లారని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వాలని కోరారు. కాగా, పోలీసులు మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడిస్తామని ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
చదవండి: ఆ ముగ్గురినీ ప్రాసిక్యూట్‌ చేయాలి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top