పాదచారీ.. నీకో దారి! 

Pedestrian 5 FOBs Ready To Start In Hyderabad - Sakshi

ప్రారంభానికి సిద్ధంగా 5 ఎఫ్‌ఓబీలు  

వీటి అంచనా వ్యయం రూ.16 కోట్లు  

సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు దాటే సమయంలో పాదచారులు ప్రమాదాల  బారిన పడకుండా ఉండేందుకు నిర్మించ తలపెట్టిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల్లో (ఎఫ్‌ఓబీ) అయిదింటిని త్వరలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వీటి అంచనా వ్యయం దాదాపు రూ.16 కోట్లు. వీటిలో రెండింటికి ఎస్కలేటర్ల సదుపాయం కూడా ఉంది. ఇవి వినియోగంలోకి వస్తే రోడ్డు దాటేందుకు పాదచారుల బాధలు తప్పుతాయి.

అయిదు ఎఫ్‌ఓబీల్లో   పంజగుట్ట హైదరాబాద్‌ సెంట్రల్‌మాల్, సికింద్రాబాద్‌ సెయింట్‌ఆన్స్‌ స్కూల్‌వద్ద నిర్మించినవి ఎస్కలేటర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని  బహుశా వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ జియావుద్దీన్‌ తెలిపారు. వీటితోపాటు నేరేడ్‌మెట్‌ బస్టాప్, రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని స్వప్న థియేటర్, బాలానగర్‌లో మరో మూడు ఎఫ్‌ఓబీల పనులు పూర్తయ్యాయన్నారు. ఎర్రగడ్డ ఈఎస్‌ఐ హాస్పిటల్‌ దగ్గరి ఎఫ్‌ఓబీ పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. 

నగరంలో ప్రధాన  
రహదారుల మార్గాల్లో రోడ్లు దాటేందుకు అవస్థలు పడుతున్న పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు వంద ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలనుకున్నప్పటికీ, అంతిమంగా ఇరవై ప్రాంతాల్లో పనులు చేపట్టగా, ఇప్పటికే రెండు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో  పాదచారులు ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారు. ఒక స్వచ్ఛందసంస్థ అధ్యయనం మేరకు రోడ్డు ప్రమాదాల్లో 52 శాతం రోడ్లు దాటుతుండగా జరిగినవే. ఎఫ్‌ఓబీలతో ఈ ప్రమాదాలు తగ్గగలవన్నారు.  

పురోగతిలో పనులు.. 
కూకట్‌పల్లి జోన్‌ రంగభుజంగ థియేటర్, ఖైరతాబాద్‌ జోన్‌లో బంజారాహిల్స్‌లోని జీవీకే వన్, ఎల్‌బీనగర్‌ జోన్‌లో సరూర్‌నగర్‌ స్టేడియం, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్, మల్లాపూర్‌ నోమా ఫంక్షన్‌ హాల్, చార్మినార్‌ జోన్‌లో శాలిమార్‌ హోటల్, రక్షాపురం క్రాస్‌రోడ్స్, శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top