పాతికేళ్లుగా మద్యం, మాంసానికి దూరం.. అలా ఎలా సాధ్యమంటే..

PALSI B TANDIs An Ideal Village In Adilabad - Sakshi

సాక్షి, తలమడుగు(ఆదిలాబాద్‌): మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టకుండా.. నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. గొడవలు లేకుండా.. ఠాణా మెట్లెక్కకుండా ఐక్యతతో మందుకు సాగుతున్నారు ఈ గ్రామస్తులు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ  ఈ పంచాయతీపై ప్రత్యేక కథనం.  

నాడు (1997లో) తండాలో పలువురు మద్యానికి బానిసయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే తండా పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరూ మద్యం ముట్టవద్దని.. అమ్మవద్దని తీర్మాణం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా విచ్చేశారు. ఆయన ప్రబోధాలతో మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. 

ఆధ్యాత్మికం వైపు...
గ్రామ జనాభా 800 వరకు ఉంటుంది. నారాయణ బాబా మరణానంతరం గ్రామంలో ఆయన పేరిట 13 ఏళ్ల క్రితం ఆలయం నిర్మించుకున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడం.. అన్నదానాలు చేయడం.. ఏటా దత్తజయంతి ఉత్సవాలను సమష్టిగా ఘనంగా నిర్వహించుకోవడం వీరికి ఆనవాయితీ. సమష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధిలోనూ అందరూ భాగస్వాములవుతున్నారు. వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీసద్గురు నా రాయణబాబా సంస్థాన్‌ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం సైతం నిర్మించి పలువురికి ఆశ్రయం కల్పిస్తున్నారు. సంస్థాన్‌ అధ్యక్షుడు జాదవ్‌ కిషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

నూతన పంచాయతీ...
ఇటీవల ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయగా పల్సి తండా అందులో భాగమైంది. సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం బాటపట్టింది. ఎన్నిక లేకుండానే సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకున్నారు ఇక్కడి వారు. మద్యానికి దూరంగా ఉండడంతోనే ఐక్యత నెలకొందని, అంతేకాకుండా గొడవలు లేకుండా శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. 

ఏకగ్రీవంగానే..
మా గ్రామంలో సర్పంచ్, వార్డుమెంబర్ల ఎన్నికలు జరుగలే. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నాం. సర్పంచ్‌గా నన్ను ఎన్నుకున్న రు. అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తున్నా.
  – చౌహన్‌ ఆంగుర్, సర్పంచ్‌

ఒకే మాటపై ఉంటాం..
గ్రామ జనాభా 800 దాకా ఉంటది. అందరం ఒకే మాటపై ఉంటాం. దానికి కారణం గ్రామంలో పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టుకోకపోవడమే. పండుగలు, శుభకార్యాలను కలిసిమెలిసి జరుపుకుంటాం.        
– జాదవ్‌ కిషన్, నారాయణబాబా సంస్థాన్‌ అధ్యక్షుడు 

ఠాణా మెట్లు ఎక్కలే..
మద్యానికి దూరంగా ఉండడంతో ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి గొడవలు జరిగిన సంఘటనలు లేవు. ఠాణా మెట్లు కూడా ఎక్కలే. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం.
– జాదవ్‌ విజయ్‌కుమార్, టీచర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top