రాష్ట్రం స్వయం సమృద్ధి! | Own Tax Revenues Growth in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రం స్వయం సమృద్ధి!

May 16 2026 2:29 AM | Updated on May 16 2026 2:29 AM

Own Tax Revenues Growth in Telangana

సొంత పన్ను రాబడుల్లో ఏటేటా పురోగతి

ఐదేళ్ల కాలంలో రూ.35 వేల కోట్లు పెరుగుదల 

2025–26లో రూ.1.31 లక్షల కోట్లు దాటిన 

సొంత పన్నుల ఆదాయం 

2024–25తో పోలిస్తే రూ.14 వేల కోట్లు అధికం 

కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మెరుగుపడితే మరింత ఉపశమనం

సాక్షి, హైదరాబాద్‌: సొంత పన్ను ఆదాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా ముందుకెళుతోంది. ఇతర గ్రాంట్లు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే వచ్చే రాబడులు ఏటేటా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35 వేల కోట్ల మేర పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

2021–22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, రాష్ట్రం విధించే ఇతర పన్నులు కలిపితే రూ.96,844 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ మొత్తం రూ.1,31,320 కోట్లకు పెరిగిందని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి యేటా సగటున మన రాష్ట్ర సొంత ఆదాయం రూ.7 వేల కోట్ల వరకు పెరుగుతోందన్న మాట.  

ప్రతి రాబడిలోనూ పెరుగుదల: ఆదాయ వనరుల వారీగా పరిశీలిస్తే ప్రతి రాబడిలోనూ వృద్ధి నమోదవుతోంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద 2021–22లో రూ.34,489 కోట్లు రాగా, 2025–26 నాటికి అది ఏకంగా రూ.52,375 కోట్లకు చేరింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ద్వారా 2021–22లో రూ.12 వేల కోట్లు రాగా, 2025–26లో రూ.15 వేల కోట్లకు చేరింది. అమ్మకపు పన్నును పరిశీలిస్తే 2021–22లో రూ.27 వేల కోట్లు వసూలు కాగా 2025–26 కల్లా రూ.33 వేల కోట్లు దాటింది. ఇక ఎక్సైజ్‌ ఆదాయం రూ.17 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ప్రతి కేటగిరీలోనూ పన్ను రాబడుల్లో గత ఐదేళ్ల కాలంలో వృద్ధి కనిపిస్తుండటం గమనార్హం. 

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా అంతంతే.. 
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా నిధులను అంచనా వేయడంలో ఆర్థిక శాఖ అధికారులు విఫలమవుతున్నారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 2021–22లో రూ.8,500 కోట్లు వస్తే ఐదేళ్ల తర్వాత 2025–26లో కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే దాటడం గమనార్హం. అయితే 2025–26లో గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ రూపంలో రూ.22,782 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అందులో కేవలం 45.75 శాతం అంటే రూ.10,422 కోట్లు మాత్రమే వచ్చాయి.

కేంద్ర పన్నుల్లో వాటా ఏటేటా పెరుగుతున్నా ఆశించిన మేర రావడం లేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 2021–22లో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.13,147 కోట్లు రాగా, ఐదేళ్ల కాలంలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే పెరిగి రూ.21 వేల కోట్లకు చేరిందని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు పద్దులు ఇంకొంత మేర పెరిగి, పన్ను రాబడుల్లో లీకేజీలను అరికట్టగలిగితే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement