ఓయూలో ఇరవైఏళ్లుగా ప్రకటించని గౌరవ డాక్టరేట్లు

Osmania University Not Announced Honour Doctorate Since 20 Years - Sakshi

1917 నుంచి 2001 వరకు 47 మంది ఎంపిక

ఒకేసారి ఐదుగురికి ప్రదానం చేసిన సందర్భాలు

ఠాగూర్, నెహ్రూ, అంబేడ్కర్, అరాఫత్‌కు దక్కిన గౌరవం

2017లో వీసీ ప్రయత్నాలకు రాజకీయ అడ్డంకులు

అక్టోబరులో జరగనున్న 81వ స్నాతకోత్సవం

సంప్రదాయాన్ని కొనసాగించాలంటున్న సీనియర్‌ ప్రొఫెసర్లు

ఉస్మానియా యూనివర్సిటీ 
వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ అందించే గౌరవ డాక్టరేట్లు మరుగునపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రతిష్టాత్మక ఈ డాక్టరేట్‌కు ఇరవై సంవత్సరాలుగా ఎవరినీ ఎంపిక చేయడం లేదు. జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేసి 1917 నుంచి వర్సిటీ ప్రతి స్నాతకోత్సవానికి గౌరవ డాక్టరేట్లను అందించేది. ఆరుగురు నిజాం నవాబ్‌లతో పాటు విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్, మాజీ ప్రధానులు పండిత్‌  జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్రప్రసాద్, పీఎల్‌ఓ (పాలస్తీనా) అధ్యక్షుడు యాసర్‌ అరాఫత్‌ తదితరులకు ఈ గౌరవం దక్కింది. 

అధికారులు శ్రద్ధ చూపితే మళ్లీ అవకాశం
వందేళ్ల శబాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకొని 104వ ఏడులోకి అడుగిడిన ఓయూ 80 స్నాతకోత్సవాలు జరుపుకొని 2001 వరకు 47 మందికి గౌరవ డాక్టరేట్లను అందచేసింది. కొన్ని స్నాతకోత్సవాల్లో ఒకటి కంటే ఎక్కువ గౌరవ డాక్టరేట్లను అందించిన ఘనత నాటి వీసీలకు, అధికారులకు దక్కింది. ఓయూలో 1982, 1986 సంవత్సరాలలో జరిగిన స్నాతకోత్సవాల్లో ఐదుగురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధికారులు శ్రద్ధ చూపితే మళ్లీ ప్రతి స్నాతకోత్సవానికి జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా విశిష్టసేవలు అందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయవచ్చు.

రాజకీయ జోక్యంతో వీసీ వెనుకడుగు
ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2017లో ప్రముఖ వ్యక్తులను గురించి గౌరవ డాక్టరేట్‌ను అందజేయాలని నాటి వీసీ ప్రొ.రామచంద్రం నిర్ణయించారు. కానీ రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకుల జోక్యం వల్ల వీసీ వెనుకడుగు వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, తెలంగాణ పునఃనిర్మాణం, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఓయూ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలనుకున్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు గొడవ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అని, ఆమెకు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందజేయాలని, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేయాలని టీజీవీపీ విద్యార్థి నాయకులు కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ఇవ్వాలని జాగృతి విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. దీంతో గౌరవ డాక్టరేట్‌ ఎంపికను పక్కన పెట్టారు. అయితే అక్టోబరులో జరిగే 81వ స్నాతకోత్సవానికి గొప్ప వ్యక్తులను ఎంపిక చేసి ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందజేసి సంప్రదాయాన్ని కొనసాగించాలని పలువురు సీనియర్‌ ప్రొఫెసర్లు పేర్కొన్నారు.

ఇంత వరకు ఓయూ గౌరవ డాక్టరేట్లు అందుకున్న వారిలో...
ఓయూ గౌరవ డాక్టరేట్లను 1917 నుంచి 2001వ సంవత్సరం వరకు 47 మంది అందుకున్నారు. వారిలో జాతీయ, అంరత్జాతీయ, స్థానికంగా విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. దేశ అధ్యక్షులు, ప్రధానులు, న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, సంఘ సేవకులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top