30 రంగులు.. 240 డిజైన్లు.. కోటీ 18 లక్షల బతుకమ్మ చీరలు సిద్ధం

One Crore 18 Lakh Bathukamma Sarees Are Ready For Distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు కోటికి పైగా చీరలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ అవతరణ తర్వాత ప్రభుత్వమే మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను తీరొక్క రంగుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు రాష్ట్ర చేనేత శాఖ తెలిపింది.

సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్‌ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించిన చీరలను రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, చీరల కోసం ఈ ఏడాది రూ.340 కోట్లను వెచ్చించినట్లు తెలంగాణ హ్యాండ్లూమ్‌ శాఖ తెలిపింది. 30 రంగుల్లో, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో పాటు 800 కలర్‌ కాంబినేషన్లతో తయారు చేయించి పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఒక కోటీ 18 లక్షల చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి: దేశానికి కేసీఆర్‌ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్‌: మాజీ సీఎం కుమారస్వామి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top