‘ఒమేగా’లో ఏఐ కేన్సర్‌ రేడియేషన్‌ మెషీన్‌

Omega Cancer Hospital New Branch Inaugurated In Gachibowli - Sakshi

దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో అందుబాటులోకి

ఒమేగా ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ మోహన వంశీ వెల్లడి

గచ్చిబౌలిలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఒమేగా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కొత్తగా మరో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది. 500 పడకలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఇక్కడ కేన్సర్‌ చికిత్సతోపాటు ఇతర అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అత్యాధునిక వైద్య సేవలతో అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన వంశీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కేన్సర్‌ రేడియేషన్‌ మెషీన్‌ (ఎథోస్‌)ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గచ్చి బౌలిలో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏఐతో పనిచేసే ‘ఎథోస్‌’ రోగుల చికిత్సను ప్రారంభ దశ నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుందని చెప్పారు.

ఇది కేన్సర్‌ రేడియేషన్‌ చికిత్సలో ఒక విప్లవమని చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి చికిత్స అందించగలగడం దీని ప్రత్యేకత అన్నారు. దేశంలో డిజిటల్‌ పెట్‌ ఎంఆర్, డిజిటల్‌ పెట్‌ సీటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్‌ మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రిగా ఒమేగా నిలిచిందని డాక్టర్‌ వంశీ వెల్లడించారు. ఐసీయూ, హై ఎండ్‌ క్యాథ్‌ల్యాబ్‌ సదుపాయాలతో  24 గంటలూ అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఈవో శ్రీకాంత్‌ నంబూరి, స్పెషాలిటీ వైద్యులు డాక్టర్‌ రవి రాజు, డాక్టర్‌ గణేష్‌ మాథన్, డాక్టర్‌ విక్రమ్‌ శర్మ, డాక్టర్‌ ఆదిత్య కపూర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top