breaking news
mohana vamsi
-
‘ఒమేగా’లో ఏఐ కేన్సర్ రేడియేషన్ మెషీన్
సాక్షి, హైదరాబాద్: ఒమేగా ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా మరో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది. 500 పడకలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఇక్కడ కేన్సర్ చికిత్సతోపాటు ఇతర అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అత్యాధునిక వైద్య సేవలతో అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కేన్సర్ రేడియేషన్ మెషీన్ (ఎథోస్)ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గచ్చి బౌలిలో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏఐతో పనిచేసే ‘ఎథోస్’ రోగుల చికిత్సను ప్రారంభ దశ నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇది కేన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవమని చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి చికిత్స అందించగలగడం దీని ప్రత్యేకత అన్నారు. దేశంలో డిజిటల్ పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ సీటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రిగా ఒమేగా నిలిచిందని డాక్టర్ వంశీ వెల్లడించారు. ఐసీయూ, హై ఎండ్ క్యాథ్‌ల్యాబ్ సదుపాయాలతో 24 గంటలూ అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఈవో శ్రీకాంత్ నంబూరి, స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ రవి రాజు, డాక్టర్ గణేష్ మాథన్, డాక్టర్ విక్రమ్ శర్మ, డాక్టర్ ఆదిత్య కపూర్ పాల్గొన్నారు. -
గుక్కెడు కృష్ణరసం... మోహనవంశీ...
ఏమీ ఆశించకుండా ప్రేమను పంచడం, శుష్కమైన జపాన్ని వదిలి ఫలాన్ని ఇచ్చే ఆరాధనను చేయడం ఎవరి నుంచి నేర్చుకున్నాడు? ఇంకెవరి నుంచి రాధ నుంచే. ఆ మహోన్నత స్త్రీయే తనకు ఇంత ప్రేమా ఇచ్చింది. ఇంత ప్రేమను ఇవ్వడమూ నేర్పింది. కృష్ణా... నల్లనయ్యా... బృందావన విహారీ... నీలికలువ తీవకు పూసిన మనోహర పుష్పమా... ప్రేమమూర్తీ.... వంశీగానంతో సకల జగత్తును సమ్మోహన పరిచే సంగీతకారుడా... మోహనవంశీ.... కురుభూమి ఉంది ఒకచోట. అదే దేవభూమి. ఆనందాల స్వర్గం. మనుషులు ఎలా ఉంటారు అక్కడ? అందంగా అపురూపంగా సౌందర్య భరితంగా ప్రకృతిలో ప్రకృతి వలే... కుసుమాల్లో కుసుమాల వలే... భ్రమరాల్లో భ్రమరాల వలే... తురంగాలలో తరంగాల వలే... వలువలు వారికి అడ్డం... కృత్రిమ విలువలూ వారికి అడ్డమే.... వారికి తెలిసిందల్లా ప్రేమ.. ప్రేమ... ప్రేమ. ప్రేమతో ఉంటారు. నీది అనరు. నాది అనరు. మనది అంటారు. ప్రేమ వస్తే ఆలింగనం చేసుకుంటారు. ఇష్టం కలిగితే చుంబనం సమర్పిస్తారు. మోహం ఏర్పడితే- ఉల్లము ఝల్లున స్పందనలు పంపితే- ఒకర్నొకరు పెనవేసుకొని ఆనందపు శయ్యపై విహరిస్తారు. లోకం నుంచి ఏమీ ఆశించరు. నిరాపేక్షగా పని చేసుకుపోతారు. కర్మను అనుసరిస్తారు. విధికి బద్ధులై నడుస్తారు. అది స్వర్గం. ఒక వ్యక్తి అలాంటి స్వర్గాన్ని ఒకచోట నిలిపాడు. దానిని అందరూ వ్రేపల్లె అన్నారు. అతణ్ణి కొందరు కృష్ణుడు అనీ రాధ మాత్రం ఆరాధనగా మోహనవంశీ అని పిలిచింది. మధురానగరం అప్పటికే కపటనగరంగా మారింది. సొంత ఆస్తి, సొంత స్త్రీ, సొంత పిల్లలు, స్వార్థం, ద్రోహం, మోసం, రాక్షసత్వం.... ప్రేమలో అనుక్షణం నిండి ఉండాల్సిన జగత్తు, చైతన్యం కలిగి సృష్టితో పాటు ప్రవహించి వెళ్లాల్సిన జగత్తు దుర్భరమైన విలువలతో తనను తాను హింసించుకుంటోంది. ఒక స్త్రీ ఒక పురుషుడు ప్రేమించుకోవడం తప్పు. ముద్దాడటం తప్పు. రమించుకోవడం నేరం. హద్దులు ఎప్పుడైతే విధించబడ్డాయో అవి ఇష్టం లేని జనులు వాటిని దాటి ‘నేరం’, ‘పాపం’ వంటి భావనలకు లోనై ‘బహిష్కరణ’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తే పాపం కాదు. దైవంలో లీనమైపోవడం నేరం కాదు. కాని ఒక మనిషిలో ఇంకొకరు ఒక మనిషి పట్ల వేరొకరు ఆరాధనతో ప్రేమతో కోరికతో లీనమైపోవడం మాత్రం నేరం. ఇది ఎవరి సంస్కృతి అని ప్రశ్నించాడు కృష్ణుడు. పదేళ్ల ఆ పిల్లవాడి, ముద్దులొలికే ఆ బాలుడి పట్ల ఆరాధన పెంచుకున్న ఆ రాధ, వివాహిత, వరుస పెట్టి పిలిస్తే నిషిద్ధ వరుసలో నిలుచున్న స్త్రీ ఆరాధిస్తే అందులో తప్పు ఉన్నదా? ఆమె స్పందనలో దైవం పాదాల వద్ద రాలిపడే చామంతి దండలా ఉండాలనే తపన. కోరిక. కామం ద్వారా ఆ సమర్పణం సంభవిస్తే ఇంకా సంతోషమే. కృష్ణుడు దీనిని స్వీకరించాడు. రాధ ప్రేమను స్వీకరించాడు. ఆమె ప్రేమనేనా? ప్రేమను పంచాలనుకునే మహోన్నత మూర్తికి తనా మనా అనే భేదం ఉంటుందా? తపతిని, నీరజను, చంద్రికను, సత్యను, రుక్మిణిని, కాళిందిని, మిత్రవింద, లక్షణ, జాంబవతి.... వీరందరి ప్రేమనూ స్వీకరించాడు. వీరందరికీ ప్రేమ పంచాడు. నిజంగా ప్రేమమూర్తి కనుల నుంచే చూడాలి ప్రేమని. మామూ లు మనిషికి ఒక మరుగుజ్జు స్త్రీ మరుగుజ్జులానే కనిపిస్తుంది. కాని కృష్ణుడు ఆమెనూ స్వీకరించి ప్రేమగా పరిగ్రహించి పానుపుపై ఆమె బతుకు పండించాడు. పది యుగాలకు సరిపడా ఆనందం పంచాడు. ఆమె ఆత్మ ఎంత సంతృప్తి పడి ఉంటుంది. నిజంగా ఒక జీవి పట్ల మరో జీవి ప్రేమను ప్రదర్శిస్తే కలిగేది శాంతి..శాంతి... శాంతే. కురూపి నాగిని కూడా తన ఆకారం ఎంత కురూపిగా ఉన్నా తన మొత్తం దేహంలో వేరెవ్వరికీ లేనంత అతి సుందరమైన పెదాలతో కృష్ణుడిని ముద్దాడి ధన్యమైనదే. అందరూ కృష్ణుడిని దేవుడు... దేవుడు అంటున్నారు. అలా అని ఎందుకంటున్నారు తాతగారూ? అని అడిగాడు కృష్ణుడు, భీష్ముడిని. ‘ఎందుకంటే నీలో సత్యం, సౌందర్యం, సామర్థ్యం ఉన్నాయి కనుక. అవి ఉన్నవాడు భగవంతుడే అవుతాడు కనుక’ అన్నాడు భీష్ముడు. కృష్ణుడు ఆలోచించాడు. ఆ మూడు లక్షణాలే అయితే సత్యవతిలో, ద్రౌపదిలో, అర్జునుడిలో కూడా ఉన్నాయి. కాని వారికి భగవంతుడి హోదా ఇవ్వడం లేదే? తనకే ఎందుకు ఇస్తున్నారు? సమాధానం తట్టింది. ఎందుకంటే తాను ప్రేమను పంచుతాడు. ప్రేమను పంచడమే తన మతంగా పెట్టుకున్నాడు. నిజం చెప్పాలా? ఇలా ఏమీ ఆశించకుండా ప్రేమను పంచడం, శుష్కమైన జపాన్ని వదిలి ఫలాన్ని ఇచ్చే ఆరాధనను చేయడం ఎవరి నుంచి నేర్చుకున్నాడు? ఇంకెవరి నుంచి రాధ నుంచే. ఆ మహోన్నత స్త్రీయే తనకు ఇంత ప్రేమా ఇచ్చింది. ఇంత ప్రేమను ఇవ్వడమూ నేర్పింది. తాను ఇస్తున్నాడు. అందుకే మనిషినైన తనను అందరూ భగవంతుడని అంటున్నారు. నిజానికి ప్రతి మనిషీ ఒక భగవంతుడు కావచ్చును. హద్దులు, సరిహద్దులు, స్వార్థాలు, నిషిద్ధాలు, ఇది అవును అది కాదు అనిపించని సువర్ణ జీవితాలను జీవించవచ్చు. కాని మనిషి ప్రస్తుతానికి అంత ఉన్నతమైన సంస్కారాన్ని ఏర్పరుచుకోలేదు. అంత ఉన్నతుడు కాలేదు. ప్రేమలో నడిస్తే, కృష్ణప్రేమలో నడిస్తే, కృష్ణుడి వలే ప్రేమను పంచుతూ వెళ్లడం చేస్తే ఒకనాటికి మనిషి ఆ స్థితికి చేరుకుంటాడు. అప్పుడిక నిషిద్ధాలు ఉండవు. సొంతమూ పరాయి అను భేదాలుండవు. నేరాలు చెరసాలలూ ఉండవు. పాపాలు కూడా ఉండవు. అప్పుడు ప్రతి భూమి ఒక దేవభూమి అవుతుంది. అప్పుడు ప్రతిప్రాణీ కృష్ణమయమే అవుతుంది. ‘మోహనవంశీ’లో కృష్ణుడు భగవంతుడు కాడు. ఒక మనిషి. తన రూపంతో, మాటతో, మురళితో ఆకర్షణలోకి ఈడ్చిపారేసే మనోహరమూర్తి. నవలంతా అతడు తానేమిటి అనే అన్వేషణ సాగిస్తాడు. నిజానికి అది కృష్ణుడి అన్వేషణ కాదు. పాఠకుడి అన్వేషణే. తానేమిటి? తానెందుకు కృష్ణుడి వలే ఉండలేకపోతున్నాడు? కృష్ణుడిలా మారాలంటే ఏం చేయాలి? నవలలో ఒక చోట భీష్ముడు- నాకు స్త్రీలోని అమృత స్రవంతులు అనుభవంలోకి రాలేదు. అందుకే నాలో సగం నిర్జీవమైంది. చైతన్యరహితమైన ఆ భాగం వృథా అయ్యింది నాయనా అంటాడు కృష్ణుడితో. భీష్ముడు స్త్రీ ప్రేమను పొందలేదు. అందువల్ల నిజమైన ఆనందానికి అర్థం తెలీదు. కాని రచయిత్రి భావన ఏమంటే ప్రేమ పొందలేని, ప్రేమను పంచలేని ఏ మనిషైనా నిర్జీవుడి కిందే లెక్క. జీవితమంటే ఏమిటి? అని కృష్ణుడు రాధను అడుగుతాడు. ఇంకా చాలా మందినే అడుగుతాడు. అందంగా జీవించడమే జీవితం అని జవాబు. సుందరంగా జీవించడం, చైతన్యంతో జీవించడం, ప్రేమతో జీవించడం అదే జీవితమంటే. ఎంతకాలం బతికామనేది కాదు ముఖ్యం. ఎంతసేపు జీవించామనేది ముఖ్యం. ఆత్మసంతృప్తికరమైన జీవితం లిప్తకాలంపాటు అనుభవించినా సరే ఆ మనసు ఇక సంతృప్తి చెందిపోతుంది. ఇక మరి దానికి మృత్యువంటే భయం లేదు. సంపూర్ణంగా అనుభవించాల్సింది అనుభవించాక మృత్యువును ఒక భయం వలే కాక విముక్తి ప్రసాదించే మార్గంగా, మరో కొత్త జీవితాన్ని ప్రసాదించబోయే కానుకగా భావించే ఆత్మజ్ఞానం సంభవిస్తుంది. ఇదంతా ఈ నవలలో చర్చిస్తుంది రచయిత్రి. అందుకే ఎప్పుడో రాసినా సరే సమకాలీనంగా సార్వజనీనంగా కళకళలాడుతూ ఉంది ఈ నవల. యమునా ప్రవాహం వంటి శైలి, తమాల వృక్షపు ఛాయ వంటి చిక్కటి శిల్పం, రాధ చనుకట్టు వంటి ఉన్నతమైన వస్తువు, శ్రీకృష్ణుడి వాక్కు వంటి తాత్త్వికత, పరిగెత్తి చేరుకోవాలనిపించే వంశీనాదం వంటి వర్ణనా విన్యాసం.... సాధారణ మనసుతో, కృత్రిమ కలం కాగితాలతో, బయట వినిపించే చప్పుళ్లు... జీవన వ్యాపారాల చికాకుల లోజగత్తు... ఇవి ఉన్నవారు చేసే రచన కాదు ఇది. అవి ఉన్నవాళ్లు ఇలా రాయలేరు కూడా. ఇదంతా ఒకానొక స్వాప్నికావస్థలో చిగిర్చే విత్తుకు మేఘధార సరిజోడులో రసోద్రేకం కలిగి దైవికంగా జరిగిన రచన ఇది. రచయిత్రి చేయి పట్టుకొని ప్రకృతి చేయించిన రచన. కృష్ణుడి గురించి ఎందరు రాయలేదు? కాని ఒక రచయిత్రి రాధలా మారి మది నిండా ప్రేమ నింపుకొని కాలంలో ఈదుకుంటూ వెళ్లి రేపల్లెలో కూచుని చేసిన రచన ఇది. తెలుగులో ఇంత మోహనరూపం కలిగిన నవల మరొకటి లేదు. లతకు సాటి రాగల పేరు మరొకటి ఉండదు. నవల: మోహనవంశీ, రచయిత్రి: తెన్నేటి హేమలత (లత) దాదాపు నలభై ఏళ్ల క్రితం వెలువడి పాఠకులను ఉర్రూతలూగించిన రచన. టైమ్ మిషన్‌లో కూచుని వెనక్కు ప్రయాణించి రేపల్లె చేరుకుని నాటి పరిసరాల్లో కూచుని రాసినట్టుగా, కన్నులతో చూసి చెప్తున్నట్టుగా అద్భుతమైన శైలిలో కృష్ణప్రేమను ప్రకటించడానికి చేసిన రచన ఇది. భారత, భాగవతాల ఆధారంగా కృష్ణుడి పాత్రను స్వీకరించి తాను మాత్రమే అంటే ఒక స్త్రీ మాత్రమే చేయదగ్గ కల్పనలతో, ఆరాధనతో లత ఈ నవలలోని అణువణువులో నిండి ఆకట్టుకుంటారు. కృష్ణుడిని మనిషిగా చూపెడుతూ సామాన్య మానవుల సమక్షంలో భాగవతాన్ని నడుపుతున్నట్టుగా రచన చేస్తూ హేతువును, తర్కాన్ని, తాత్త్వికతను మిళితం చేయడం వల్ల ఏ కాలంలో అయినా ఏ తరం అయినా తప్పనిసరిగా చదవదగ్గ రచనగా ఇది మారింది. ఇది లత తన 28వ ఏటలోనే సాధించిన ఘన విజయం. ఎంత మంది తెలుగు రచయితలు ఆ వయసులో ఈ స్థాయి రచన చేశారు? అది లత గొప్ప. మోహనవంశీ మార్కెట్లో అందుబాటులో ఉంది. వెల: రూ. 60 ప్రతులకు: 0866 - 2436643 అక్షరాలను సాకిన చేతులు పసిడి రెక్కలు విసిరి కాలం ఎక్కడికీ పారిపోలేదు. అది కొన్ని పూలు రాల్చి వెళ్లింది. కొన్ని నీడల్ని మిగిల్చి వెళ్లింది. కొన్ని జ్ఞాపకాలని ఫొటోఫ్రేమ్లలో అమర్చి తలుచుకొమ్మని ముద్దులిచ్చి వెళ్లింది. గతకాలం ఎప్పటికీ మేలే వచ్చు కాలం కంటే. కలం తప్ప వేరే ఏమీ లేని రోజులు. కాగితాలు తప్ప వేరే ఏమీ లేని రోజులు. పాఠకులు, రచనలు తప్ప వేరే ఏమీ లేని రోజులు అవి. మహిళా రచయితలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలం. మగ రచయితలు ఆకులందు అణిగిమణిగి కూస్తున్న కాలం. బహుశా 1965 కావచ్చు. కాసుబ్రహ్మాందరెడ్డి ఇంటనో ఆయన శ్రీమతి సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగానో కొంతమంది రచయిత్రులు కలిశారు. ఇలా ఒక బంగారు జ్ఞాపకాన్ని ఇచ్చారు. గుర్తు పట్టగలిగారా? లేకుంటే ఇవీ పేర్లు. ఎడమ నుంచి: రంగనాయకమ్మ, పి.యశోదా రెడ్డి, రాఘవమ్మ (కాసుబ్రహ్మానంద రెడ్డి శ్రీమతి), భానుమతి రామకృష్ణ, ఇల్లిందల సరస్వతీదేవి, తురగా జానకీరాణి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తెన్నేటి హేమలత (లత).