అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు | No money for emergency expenses in Telangana Govt | Sakshi
Sakshi News home page

అత్యవసర ఖర్చులకూ దిక్కులేదు

Mar 31 2026 4:32 AM | Updated on Mar 31 2026 4:32 AM

No money for emergency expenses in Telangana Govt

2024–25లో ఆర్బీఐ నుంచి 123 రోజులపాటు చేబదులు రుణాలు 

ఆర్బీఐ నుంచి రూ.37,457 కోట్ల చేబదులు 

ఖర్చులకు ఆదాయం సరిపోక 363 రోజులపాటు ప్రత్యేక రుణాలు 

రూ.4,47,493 కోట్లకు ఎగబాకిన ప్రభుత్వ అప్పులు  

2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ అక్షింతలు

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగి అత్యవసర ఖర్చులకూ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నుంచి మొత్తం 123 రోజులపాటు చేబదులు (ఓవర్‌ డ్రాఫ్ట్‌) రుణాలను తీసుకుందని కంప్ట్రో­లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) అక్షింతలు వేసింది. ప్రతిరోజూ రాష్ట్ర ఖజానాలో కనీసం రూ.1.38 కోట్ల నిధుల నిల్వ ఉండాలని ఆర్బీఐ నిర్దేశించగా, 2024–25లో ఏకంగా 123 రోజులపాటు అంతకంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మొత్తం రూ.37,457 కోట్లను చేబదులుగా ఆర్బీఐ నుంచి తీసుకుంది. 

2024–25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌’ పేరుతో కాగ్‌ రూపొందించిన నివేదికను సోమవారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యవసర ఖర్చులకూ ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా చేబదులు తీసుకోవచ్చు. ఆదాయం సమకూరగానే ఆర్బీఐకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014–15లో 62 రోజులు మాత్రమే చేబదులు తీసుకోగా, 2022–23లో అత్యధికంగా 328 రోజులపాటు తీసుకున్నారు. 2024–25లో 123 రోజులకి చేబదులు రుణాలు తగ్గడం గమనార్హం.  

363 రోజులూ రుణాలే... 
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి 2024–25లో ఆర్బీఐ నుంచి ప్రభుత్వం 298 రోజులపాటు రూ.64,188 కోట్ల వేస్‌ అండ్‌ మీన్స్‌ రుణాలను తీసుకోగా, 363 రోజులపాటు రూ.27,730 కోట్ల ప్రత్యేక రుణాలను తీసుకుంది. ఈ తాత్కాలిక రుణాలను మూడు నెలల్లో చెల్లించాల్సి ఉండగా, రూ.5842 కోట్లను గడువులోగా చెల్లించడంలో విఫలమైంది. రాష్ట్రం 2024–25లో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటు, రూ.48,922 కోట్ల ద్రవ్యలోటును కలిగి ఉంది. 

ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటుగా, ఆదాయం (రుణాలు మినహాయించి), వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. రూ.46,370 కోట్ల అప్పులను సమీకరించడం ద్వారా ద్రవ్యలోటును ప్రభుత్వం అధిగమించింది. ఆ సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ.1,67,804 కోట్ల ఆదాయం రాగా, అందులో 45 శాతాన్ని జీతభత్యాల రూపంలో తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులకే ప్రభుత్వం వెచ్చించాల్సి వచ్చింది. జీతాలకు రూ.30,277 కోట్లు, వడ్డీల చెల్లింపులకు రూ.27,803 కోట్లు, పెన్షన్ల చెల్లింపులకు రూ.16,942 కోట్లను ఖర్చు చేసింది.  

ఏటేటా పెరుగుతున్న అప్పులు 
రాష్ట్ర అప్పులు ఏటేటా పెరుగుతున్నాయి. 2020–21లో రూ.2,78,018 కోట్లు ఉన్న ప్రభుత్వ అప్పులు 2024–25 నాటికి రూ.4,47,493 కోట్లకు ఎగబాకాయి. ఇక ప్రభుత్వ పూచీకత్తు అప్పులు 2020–21లో రూ.1,05,007 కోట్లు ఉండగా, 2024–25 నాటికి రూ.2,41,528 కోట్లకు చేరాయి. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన అప్పుల మొత్తం సైతం రూ.3.83 లక్షల కోట్ల నుంచి రూ.6.89 లక్షల కోట్లకు పెరిగింది.  

Advertisement
 
Advertisement
Advertisement