రెవెన్యూ వ్యవస్థ: ‘టైటిల్‌’ గ్యారంటీ | Niti Aayog Sent To The States Over Title Guarantee Draft Act | Sakshi
Sakshi News home page

రెవెన్యూ వ్యవస్థ: ‘టైటిల్‌’ గ్యారంటీ

Nov 3 2020 1:14 AM | Updated on Nov 3 2020 4:41 AM

Niti Aayog Sent  To The States Over Title‌ Guarantee Draft Act - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ‘టైటిల్‌ గ్యారంటీ’ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. యూపీఏ సర్కారు 2011లో రూపొందించిన భూ హక్కుల ముసాయిదా చట్టానికి మార్పులు, చేర్పులు చేసి.. కొత్త్త ముసాయిదాను రూపొందించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు నూతన ముసాయిదా చట్టం–2020, నియమాల(రూల్స్‌)ను తయారు చేసిన నీతి ఆయోగ్‌ వాటిని రాష్ట్ర ప్రభు త్వాలకు పంపింది. కేంద్రం రూపొందించిన టైటిల్‌ గ్యారంటీ ముసాయిదా చట్టంతో పాటు మహారాష్ట్ర చట్టాన్ని కూడా జతపరిచింది. ఈ రెండింటిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా టైటిల్‌ గ్యారంటీ చట్టాలను రూపొందించు కోవాలని స్పష్టం చేసింది.

కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు (రెగ్యులేషన్లు) పంపింది. ఇప్పటికే హరియాణాలో ప్రయో గాత్మకంగా అమలు చేస్తున్న ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ 2024లోపు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. భూ వివాదాలకు అంతిమ పరిష్కారం టైటిల్‌ గ్యారంటీ చట్టంతోనే సాధ్యపడుతుం దని కేంద్ర సర్కారు భావిస్తోంది. గత యూపీఏ ప్రభుత్వం టైటిల్‌ గ్యారంటీని 2020లోపు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా కూడా తయారు చేసింది. ఆ తర్వాత కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావ డంతో ఈ చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త ముసాయిదాను రూపొం దించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు మోదీ ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీకే అగర్వాల్‌ నేతృత్వంలోని కమిటీ ముసాయిదాకు తుదిరూపు ఇచ్చింది. ఈ డ్రాఫ్టును తాజాగా నీతి ఆయోగ్‌ రాష్ట్రాలకు పంపింది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌(ఆర్వోఆర్‌) స్థానే కంక్లూజివ్‌ టైటిల్‌ను తేవాలని కేంద్రం నిర్ణయించింది.

కేవలం రెండు రిజిస్టర్లే..!
టైటిల్‌ గ్యారంటీ ముసాయిదా చట్టంలో పలు కీలకాంశా లను నీతి ఆయోగ్‌ పొందుపరిచింది. భూములకు సంబం ధించి పదుల సంఖ్యలో ఉన్న రిజిస్టర్ల స్థానంలో రెండు రిజిస్టర్లనే నిర్వహించాలని అభిప్రాయపడింది. అవి టైటిల్‌ రిజిష్టర్, దానికి అనుబంధంగా వివాదాల రిజిష్టర్‌ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. భూ సర్వే, ఇతరత్రా సంస్కరణలకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం ఇదివరకే అంగీకరించింది. భూ భారతి, మొదలు సమగ్ర భూ సర్వేకు కూడా నిధులను విడుదల చేసింది. దీంట్లో భాగంగానే టైటిల్‌ గ్యారంటీ చట్టం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను అందజేసేందుకు సుముఖంగా ఉంది. 

ముసాయిదా చట్టంలో ముఖ్యాంశాలు:
– అన్ని రకాల భూములకు ఇక ఓకే ఒక రికార్డు. వివాదాలు ఉంటే తాత్కాలికంగా మరో రికార్డులో.
– వివాద పరిస్కారాలకు ట్రిబ్యూనళ్ల ఏర్పాటు.
– రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వమే పూచీకత్తు. యజమానికి నష్టం జరిగితే పరిహారం.
– రికార్డుల్లోకి ఎక్కిన వివరాలను రెండేళ్ల తరువాత మార్చే వీలు ఉండదు
– భూముల సర్వే చేసి ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య.

ఏపీలో ఇప్పటికే చట్టానికి ఆమోదం
టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని అమలుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ఒకడుగు ముందుంది. గతేడాది ఏపీ అసెంబ్లీ టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ చట్టం అమలుకు ఆయువు పట్టయిన భూ సమగ్ర సర్వేను వచ్చేడాది జనవరి నుంచి శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది.

మన రాష్ట్రంలో ఇలా..
తెలంగాణలోనూ కంక్లూజివ్‌ టైటిల్‌ను తీసుకురావాలని గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళనతో రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించింది. ఈ క్రమంలో కంప్యూటర్‌ ఆధారిత భూ రికార్డుగా ప్రకటించిన ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. పార్ట్‌–బీ, పెండింగ్‌ కేసులను కొలిక్కి తేవడానికి సమగ్ర భూ సర్వేను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల మూడుచింతలపల్లిలో జరిగిన ధరణి ప్రారంభోత్సవ సభలో ప్రకటించారు. దీంతో మన రాష్ట్రం కూడా టైటిల్‌ గ్యారంటీ చట్టం వైపు అడుగులేస్తుందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement