బంగ్లాదేశ్‌ టు హైదరాబాద్‌

NIA found that trafficking of young women - Sakshi

యువతులను అక్రమ రవాణా చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ 

చార్జిషీట్‌ దాఖలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ  

40 ఏళ్లుగా భారత్‌లో బంగ్లాదేశీయుల సెక్స్‌ రాకెట్‌ 

12 మందిని నిందితులుగా పేర్కొన్న ఎన్‌ఐఏ 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధి పేరుతో అమాయక యువతులను బంగ్లాదేశ్‌ నుంచి హైదరాబాద్‌ అక్రమంగా తరలిస్తున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తొలుత 2019 సెప్టెంబర్‌లో పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఓ వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు తరువాత దీనితో సంబంధమున్న పది మందిని అరెస్టు చేశారు. జల్‌పల్లి, బాలాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి పోలీసులు రక్షించిన యువతుల్లో బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. వీరిని ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా దేశం దాటించి తీసుకువచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి వద్ద భారతీయులుగా చలామణి అయ్యేందుకు ఉన్న నకిలీ ధ్రువపత్రాలు, ఐడెంటిటీ కార్డులతో పాటు ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు తరువాత ఎన్‌ఐఏకు బదిలీ అయింది. 

1980 నుంచి ఇదే దందా..
ఈ కేసులో ఏ2గా ఉన్న రుహుల్‌ అమిన్‌ దాలిని 2019, డిసెంబర్‌ 12న ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఇతను 1980లో అక్రమ మార్గాల్లో బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తన భార్య బిత్తి బేగంతో కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో పలు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నాడు. ఇందుకు కావాల్సిన యువతులను బంగ్లాదేశ్‌లోని తన ఏజెంట్ల ద్వారా భారత్‌కు రప్పిస్తున్నాడు. ముఖ్యంగా 19 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులకు ఉపాధి ఎరవేసి భారత్‌కు తీసుకువస్తున్నారు. వీరికి అధికారిక వీసా రావడం కష్టం.. అందుకే అడ్డదారుల్లో తీసుకువస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. బెంగాల్‌లోని సోనాయ్‌ నది మార్గం గుండా తొలుత కోల్‌కతాలోకి తీసుకువస్తారు. అక్కడ నుంచి కోల్‌కతా, ముంబై, హైదరాబాద్‌లలోని వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ బారిక్‌ షేక్‌తో కలిసి భారత్‌ నుంచి యువతులను బంగ్లాదేశ్‌కు కూడా తరలించేవాడు. కాగా, అబ్దుల్‌ బారిక్‌ షేక్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇతడు బంగ్లాదేశ్‌కు పారిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వారిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. పోలీసులు రక్షించిన బంగ్లాదేశీ యువతులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని షెల్టర్‌ హోంలలో ఆశ్రయం పొందుతున్నారు.  

నిందితులు వీరే.. 
యువతులను అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్న వ్యవహారంలో మొత్తం 12 మందిని ఎన్‌ఐఏ నిందితులుగా గుర్తించింది. వీరిలో ప్రధాన సూత్రధారితో సహా పది మంది బంగ్లాదేశీయులు కాగా.. ఇద్దరు భారతీయులు. ఎన్‌ఐఏ చార్జిషీటు ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన 1.అబ్దుల్‌ బారిక్‌ షేక్, 2. రుహుల్‌ అమీన్‌ దాలి 4. మహమ్మద్‌ యూసుఫ్‌ఖాన్‌ , 5.బిత్తి బేగం, 6. మహమ్మద్‌ రానా హుస్సేన్‌ , 8. మహమ్మద్‌ అల్‌ మెమన్‌ 9. సోజిబ్‌ షేక్, 10. సురేశ్‌కుమార్‌ దాస్‌. 11. మహమ్మద్‌ అబ్దుల్లా మున్షి, 12.మహమ్మద్‌ అబ్దుల్‌ షేక్‌.. మహారాష్ట్రకు చెందిన 3. అసద్‌ హసన్‌ , 7.షరీఫుల్‌ షేక్‌లు నిందితులు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top