
సెప్టెంబర్ కోటా విడుదల
1వ తేదీ నుంచి సరుకుల పంపిణీ
కొత్తగా లక్ష కుటుంబాలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో కొత్త ఆహార భద్రత (రేషన్)కార్డుదారులకు శుభవార్త. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు అందనున్నాయి. పాత కార్డుదారులతో పాటు కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు కూడా నెలవారీ రేషన్ కోటా విడుదలైంది. పౌరసరఫరాల గోదాంల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఇండెంట్ ప్రకారం బియ్యం స్టాక్ సరఫరా ప్రారంభమైంది. సెపె్టంబర్ నుంచి సుమారు లక్షకు పైగా కొత్త కార్డుదారులకు బియ్యం అందనున్నాయి. పౌరసరఫరాల శాఖ గత ఐదు నెలల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ వస్తోంది.
ఈ నెల 20 వరకు మంజూరైన కార్డుదారులకు సెపె్టంబర్ కోటా కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత కార్డుదారులకు జూన్ నెలలోనే ఒకేసారి మూడు నెలల కోటా కింద రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. అయితే.. మే 20 వరకు మంజూరైన కొత్త కార్డుదారులకు కూడా మూడు నెలల కోటా ఒకేసారి అందజేశారు. అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నా... రేషన్ కోటా మాత్రం కేటాయించలేదు. మూడు నెలల కోటా గడువు ముగియడంతో తాజాగా పాత కార్డుదారులతో పాటు కొత్తవారికి కూడా సెపె్టంబర్ కోటా కేటాయించారు.
గ్రేటర్‌లో 13.76 లక్షలకుపైగా కార్డులు
గ్రేటర్ పరిధిలో సుమారు 13.76 లక్షల కార్డులు ఉండగా, అందులో దాదాపు 60.01 లక్షల యూనిట్లు (లబి్ధదారులు) ఉన్నారు. ప్రతి కార్డులోని యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం కోటా కేటాయించారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా వచ్చే నెల 1 నుంచి 15 వరకు నెలవారీ కోటా పంపిణీ చేస్తారు. లబ్ధి కుటుంబాలు సెలవులు మినహా మిగతా రోజుల్లో నెలవారీ కోటాను డ్రా చేసుకోవచ్చు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని సభ్యులు(కార్డులో పేరు ఉన్న సభ్యులు) ఒకరు ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ఇచ్చి కుటుంబానికి కేటాయించిన సరుకుల కోటాను డ్రా చేయవచ్చు సన్న బియ్యం మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగతా సరుకులు సబ్సిడీపై కొనుగోలు చేయాల్సి ఉంది.