మంట పుట్టిస్తున్న మటన్‌ ధరలు.. కిలో ధర ఎంతంటే!

Mutton Price In Hyderabad: Meat Prices Increase Acute Shortage of Livestock - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాంసాహార ప్రియులకు చేదువార్త. మటన్‌ ధరలు మంట రేపుతున్నాయి. తెలంగాణలో మేక మాంసం ధర మరోసారి  ‘వెయ్యి’ మైలురాయివైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుత స్పీడ్‌ చూస్తుంటే త్వరలోనే మటన్‌ థౌజండ్‌ వాలా పేలడం ఖాయంగానే కనిపిస్తోంది. క్వాలిటీని బట్టి కిలో మటన్‌ ధర ప్రస్తుతం 800 నుంచి 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మటన్‌ ఇప్పటికే కొన్నిచోట్ల నాలుగు అంకెల స్థాయికి చేరిందని టాక్‌. 

సామాన్యులకు దూరం
గత కొద్ది సంవత్సరాలుగా ధరలు బాగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్యులు మటన్‌ కొనాలంటే జంకుతున్నారు. మేక మాంసం కొనే స్తొమత లేక చికెన్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొరగా మాత్రమే మటన్‌ కొంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు మటన్‌కు దూరమవుతున్నారు. గతేడాది జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మటన్‌ కిలో ధర వెయ్యి రూపాయలు దాటినా తర్వాత దిగివచ్చింది. బర్డ్‌ప్లూను బూచిగా చూపి అప్పట్లో కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. కరోనా సమయంలోనూ మటన్‌ ధరలు ఆకాశాన్నంటాయి.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మటన్‌ వినియోగం ఎక్కువ. ఈమధ్య కాలంలో మటన్‌ వినియోగం బాగా పెరిగిందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల వినియోగానికి సరిపడనంతగా గొర్రెలు, మేకలు అందుబాటులో లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం తెలంగాణలో  2019లో 1.91 కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నట్టు అంచనా. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 600 ట్రక్కుల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు సరఫరా అవుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా డిమాండ్‌ను అందుకోకలేకపోతోంది. గొర్రె, మేకల నుంచి 50 శాతం మాత్రమే మాంసం వస్తుందని.. అదే చికెన్‌ అయితే 70 శాతం వస్తుందని.. మటన్‌ ధర ఎక్కువగా ఉండడానికి ఇదీ ఓ కారణం. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా మంసాహారం వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. చికెన్‌ మాదిరిగా మటన్‌ ధరను నిర్ణయించే ఓ వ్యవస్థ లేకపోవడంతో ధరలపై నియంత్రణ లేకుండా పోతోంది. ధరల మాట ఎలా ఉన్నా ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాత్రం గత నెల రోజులుగా మటన్‌ విక్రయాలు భారీగా పెరిగాయని పరిశీలకుల అంచనా.  

మాంసాహారులే ఎక్కువ
దేశంలో మాంసాహారులు పెరుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–5 వెల్లడించింది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని తెలిపింది. అయితే మటన్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. 73 శాతం మంది ప్రజలు కనీసం వారంలో ఒకసారైనా మాంసం తింటున్నారు. కేవలం 4.4 శాతం మంది ఎటువంటి మాంసాహారం ముట్టకుండా కోడిగుడ్డు మాత్రమే తీసుకుంటున్నారు. 0.27 శాతం మంది మాత్రమే వెజిటేరియనన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (క్లిక్ చేయండి: నిమ్స్‌కు మునుగోడు గ్రహణం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top