
సమతుల్య ఆహారమే కాక ఆరోగ్యం కూడా..
గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ ఆహారంగా వాడుక
కరకగూడెం: వర్షాకాలం ప్రారంభం కాగానే అటవీ ప్రాంతంలో పుట్టగొడుగులు పెరుగుతుంటాయి. గ్రామాల్లో మొలిచే పుట్టగొడుగులతో పోలిస్తే అటవీ ప్రాంతంలో పెరిగేవి గిరిజన, ఆదివాసీల ఆహారంలో ఏళ్లుగా భాగమవుతున్నాయి. అంతేకాక వీటి అమ్మకం ద్వారా గిరిజనులు ఆర్థిక వనరుగా ఉపయోగించుకుంటున్నారు. గిరిజన, ఆదివాసీలు పుట్టగొడుగులను సేకరించి చిన్న కట్ట రూ.50కి, కేజీ రూ.500–రూ.700 వరకు ప్రాంతాల ఆధారంగా విక్రయిస్తుంటారు. ఏటా ఈ సీజన్‌లో మాత్రమే దొరికేవి కావడంతో ఆదరణ కూడా బాగుంటోంది.
పుట్టగొడుగుల రకాలు.. గుర్తింపు
గిరిజన ప్రాంతాల్లో తెల్ల, నల్ల పుట్టగొడుగులు కనిపిస్తాయి. అయితే, ఇందులో తినదగినవే కాక విషపూరితమైనవి కూడా ఉంటాయి. వీటి మధ్య తేడాను గుర్తించే పరిజ్ఞానం గిరిజనులకు అనాదిగా వస్తుండటంతో సులువుగానే సేకరిస్తుంటారు. పుట్టగొడుగుల రంగు, ఆకారం, వానే కాక అవి పెరిగిన ప్రదేశం ఆధారంగా తినదగినవా, విషపూరితమైనవా అన్నది గుర్తిస్తారు.
తేమతో కూడిన వాతావరణంలో చెట్ల మొదళ్ల వద్ద, కుళ్లిన కలపపై లేదా మట్టిలో మొలి చే పుట్టగొడుగులను జాగ్రత్తగా సేకరిస్తారు. వీటితో కూ ర, పులుసులు, వేపుళ్లు, కొన్ని ప్రాంతాల్లో పచ్చళ్లు చేసుకుంటుండగా.. ఎక్కువగా సేకరిస్తే సమీప సంతలు, పట్టణాల్లో అమ్ముతుంటారు.
పోషకాల పవర్‌హౌస్
పుట్టగొడుగులు రుచికరమైనవే కాకుండా, ప్రొటీన్లు, విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ బీ, డీ,), సెలీనియం, కాపర్, పొటాíÙయం వంటి ఖనిజాలే కాక ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఉండే కొన్ని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. తద్వారా వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులను సంప్రదాయ వైద్యంలో ఔషధాలుగానూ వినియోగిస్తారు.
ఏటా ఎదురుచూస్తాం..
వర్షాకాలం వస్తుందంటే పుట్టగొడుగుల కోసం ఎదురుచూస్తాం. అడవిలోకి వెళ్లి సేకరించడం అలవాటు. వీటితో వండిన కూర రుచిగా ఉంటుంది. అందుకే చిన్నాపెద్దలు ఇష్టంగా తింటారు. ఎక్కువగా దొరికినప్పుడు అమ్ముకోవడం ద్వారా కాస్త డబ్బులు కూడా వస్తాయి. – సావిత్రి, మొగిలితోగు గ్రామస్తురాలు
చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం..
చిన్నప్పటి నుంచి పుట్టగొడుగులు తింటున్నాం. ఏది తినాలి, ఏది విషపూరితమైనదో పెద్దల ద్వారా తెలుసుకున్నాం. వర్షాకాలంలో తినడానికే కాక అమ్ముతూ ఎంతో కొంత సంపాదిస్తాం. అడవిలో సహజంగా దొరికేది కావడంతో మాకు బలాన్ని ఇస్తుందని తప్పక తింటాం. – సమ్మయ్య, రేగళ్ల గ్రామస్తుడు
ఆరోగ్యానికి ఎంతో మేలు
పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తి పెంచడం, వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల కట్టడికి ఉపయోగపడతాయి. ఇందులో ఏవి తినదగ్గవో సరిగ్గా గుర్తించకపోతే ప్రాణాంతకం అవుతాయి. అందుకే ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. – రవితేజ, వైద్యాధికారి, కరకగూడెం పీహెచ్‌సీ