Lockdown Impact: ‘చిరు’ నవ్వులు దూరం

Mulugu: Lockdown Effect Small Industry Collapsed - Sakshi

లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులు, కార్మికుల బతుకులు ఆగం

ఆర్థిక ఇబ్బందుల్లో వేలాది కుటుంబాలు

పూట గడవక పనుల కోసం ఎదురుచూపులు

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

భూపాలపల్లి: కరోనా మహమ్మారి వేల కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. అయిన వారిని కోల్పోయి వేలాది మంది దుఖః అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పూట గడవక పనుల కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్‌ ప్రబలడమేమో కానీ కూలీ దొరికి ఇంటికి నిత్యావసర సరుకులు తీసుకెళ్తే బాగుండు అని భావిస్తున్నారు.

ఉపాధి లేక వేలాది మంది..
రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభించి పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు తెరవాలని, మిగతా సమయాల్లో కచ్చితంగా లాక్‌డౌన్‌ పాటించాలని ప్రకటించింది. దీంతో వ్యాపారాలు, ప్రజా రవాణా, వివిధ రంగాల్లో పనులు జరుగక అసంఘటిత రంగంలోని 27 విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరంతా గత 12 రోజులుగా పనులు లేక పస్తులుండాలి్సన పరిస్థితి నెలకొంది.  కుటుంబాన్ని వెళ్లదీసేందు కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చేసేది లేక అప్పులు తీసుకొని వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయం..
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ చిరు వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటో, ట్రాలీ డ్రైవర్లు లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో అడ్డాల వద్ద గిరాకీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీ, రిక్షా కార్మికుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. పొట్టకూటి కోసం రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారం సాగించే కూరగాయలు, పండ్లు, సోడా, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, గప్‌చుప్, మిర్చిబండ్ల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఇంటికే పరిమితమై వైరస్‌ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా.. లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

పూట ఎల్లుడు ఇబ్బంది ఐతాంది..
లాక్‌డౌన్‌ పెట్టినంక పుటకు ఎల్లుడు ఇబ్బంది ఐతాంది. ఇదివరకు రోజంతా రిక్షా తొక్కితే రూ. 400 నుంచి రూ. 500 వచ్చేవి. ఇప్పుడు రిక్షా అడిగినొళ్లే లేరు. అడ్డా మీద రోజుకు నాలుగు రిక్షాలు బయటకు వెళ్తలేవు. రోజుకు ఒక గిరాకీ వస్తే వస్తాంది.. లేదంటే లేనే లేదు. రోజుకు వంద కూడా సంపాదించకపోతే ఇల్లు ఎట్ల గడుస్తది. చాన ఇబ్బంది పడుతానం.
- మొలుగూరి సారయ్య, రిక్షా కార్మికుడు

ఇంటికాడనే ఉంటాన..
లాక్‌డౌన్‌ల పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాండ్లు తియ్యాలె అంటుండ్రు. మధ్యాహ్నం అయితేనే సోడాలకు గిరాకీ ఉంటది. పొద్దుపొద్దున సోడా తాగెటోళ్లు ఎవ్వరు ఉండరు. పొయిన ఎండాకాలం మొత్తం లాక్‌డౌనే ఉన్నది. ఇప్పుడు కూడా గట్లనే అయింది. ఇంటి కర్చులైతే ఆగవు కదా. పని లేక, పైసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మాలాంటి వాళ్లను ఆదుకోవాలె.
- మార్కండేయ, సోడాబండి వ్యాపారి

ప్రభుత్వం సాయం అందించాలి
కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఎవరూ బయటకు వస్తలేరు. ఆర్టీసీ బస్సులే నడుస్త లేవు. ఇగ మా ఆటోలు నడుస్తయా. ఉదయం 6 గంటలకు ఆటోను అడ్డా మీద ఉంచితే ఒక్కరు కూడా కిరాయి అడుగుతలేరు. రోజుకు రూ. వంద గిరాకీ కూడా అయితలేదు. చూసి చూసి 9 గంటలకు ఇంటికి వెళ్తున్నాం. ఆటో ఫైనాన్స్‌కు కిస్తీ తప్పకుండా కట్టాలి్సందే. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.
- యార రామకృష్ణ, ఆటో డ్రైవర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top