ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదివి.. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు!

Msc Student Turns Farmer Earns Profit In Musk Melon Adilabad - Sakshi

సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదివాడు.. ఓవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. తనకున్న భూమిలో వరి, మస్క్‌ మిలన్, వాటర్‌ మిలన్‌ పండిస్తున్నాడు.. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని సిర్‌పూర్‌ గ్రామానికి చెందిన పోగుల నరేశ్‌(94924 61297) అనే యువ రైతు. సాగులోని విషయాలను తోటి రైతులకు వివరిస్తున్నాడు. 

ఆరెకరాల్లో పంటల సాగు
నరేశ్‌కు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండెకరాల్లో వరి, రెండెకరాల్లో అనంతపూర్‌ లాంటి ప్రాంతాల్లో సాగు చేసే మస్క్‌ మిలన్‌(కర్బూజ), మరో రెండెకరాల్లో వాటర్‌ మిలన్‌(పుచ్చకాయ) పంటలు సాగు చేస్తున్నాడు. ఈ పంటల ఉత్పత్తులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా చేతికి వచ్చేలా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. మస్క్‌ మిలన్, వాటర్‌ మిలన్‌ పంటలు పూర్తవగానే, ఆ స్థలంలో స్వీట్‌ కార్న్, మొక్కజొన్న, బీర, బీన్స్‌ పండిస్తున్నాడు.

హైదరాబాద్‌ నుంచి విత్తనాల కొనుగోలు
మస్క్‌ మిలన్‌ కాయలను నగర, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జ్యూస్‌గా వాడతారు. దీంతో వాటికి సహజంగానే డిమాండ్‌ ఉన్నప్పటికీ వేసవిలో మరీ ఎక్కువ ఉంటుంది. ఇది గమనించిన నరేశ్‌ ఏటా శివరాత్రి నుంచి మామిడి పండ్లు వచ్చే వరకు మస్క్‌ మిలన్‌ కాయలను మార్కెట్‌కు తరలించేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. భూమిని బాగా దున్నించి, చివరి దుక్కిలో పశువుల ఎరువు వేస్తున్నాడు.

తర్వాత, ట్రాక్టర్‌తో బెడ్స్‌ తయారు చేసి, వాటిపై డ్రిప్‌ లేటరల్‌ పైపులు వేస్తున్నాడు. ఆ తర్వాత, కలుపు మొక్కలు రా కుండా, నీరు ఆవిరి కాకుండా మల్చింగ్‌ పేపర్‌ ఉంచుతాడు. ఆ పేపర్‌పై రంధ్రాలు చేసి, మస్క్‌ మిలన్‌ విత్తనాలు నాటుతుంటాడు. ఈ విత్తనా లను రెండు ఎకరాలకు సరిపడేలా రూ.16 వేలు వెచ్చించి, హైదరాబాద్‌ నుంచి తెప్పిస్తున్నాడు.

సస్యరక్షణ చర్యలు
మస్క్‌ మిలన్‌ పంట 65 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. డిసెంబర్‌ 15 ప్రాంతంలో విత్తనాలు నాటగా, పంటను మార్చి మొదటి వారంలో మార్కెట్‌కు తీసుకెళ్లేలా చూసుకుంటాడు. పంటకు కావాల్సిన పోషకాలు, ఎరువులు, సాగు నీటిని డ్రిప్‌ ద్వారా అందిస్తున్నాడు. పైపాటుగా ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రిషన్స్‌ను 4, 5 సార్లు పిచికారీ చేస్తున్నాడు. పండు ఆకు రోగం, కాయ తొలుచు పురుగు రాకుండా ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటున్నాడు.  

ఎకరానికి 9 టన్నుల దిగుబడి
ఎకరానికి 9 టన్నుల చొప్పున రెండెకరాల్లో 18 టన్నుల మస్క్‌ మిలన్‌ దిగుబడి వచ్చిందని నరేశ్‌ తెలిపాడు. పంట కోయక ముందే నిజమాబాద్‌లోని పలు జ్యూస్‌ సెంటర్ల నిర్వాహకులతో మా ట్లాడుకొని, కిలో రూ.30 నుంచి రూ.35 చొప్పున విక్రయించినట్లు పేర్కొన్నాడు. పంట సాగు ఖర్చులు రూ.50 వేలు పోను, ఎకరాకు రూ.లక్ష చొప్పున ఆదాయం వచ్చిందని తెలిపాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top