MLAs Purchase Case: బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు

MLAs Purchase Case: SIT notices to Bandi Sanjay follower Srinivas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడు బూసారపు శ్రీనివాస్‌కు గురువారం సిట్‌ నోటీసులు ఇచ్చింది. నవంబర్‌ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్‌ ఫ్లైట్‌ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం. 

వీరిద్దరూ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ కేసులో సహ నిందితుడిగా ఉన్న నందుకుమార్‌తోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్‌)కు అప్పగించిన మరుసటి రోజునే సైబరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం ఒకటి ఢిల్లీకి చేరుకొని విచారణ చేపట్టింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం, కాల్‌డేటా ఆధారంగా ఫరీదాబాద్‌లో వీరిని అదుపులోకి తీసుకుంది. వీరికి ముగ్గురు ముద్దాయిలతో ఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వీరి ప్రమేయం తదితర వివరాలపై ఆరా తీస్తోంది.

ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్‌లో అరెస్ట్‌ చూపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అరెస్ట్‌తో కేసు విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.  

చదవండి: (బుల్లెట్‌ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్‌.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top