నేడు, రేపు స్పీకర్ చాంబర్‌లో ఎమ్మెల్యేల విచారణ
తెల్లం, సంజయ్, పోచారం, గాందీకి నోటీసులు జారీ
ఎనిమిది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయమే తరువాయి
రాజీనామా బాటలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మౌఖిక వాదనలు వినేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎం.సంజయ్‌తోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జి.జగదీశ్‌రెడ్డి మౌఖిక వాదనలను స్పీకర్ వింటారు.
20న ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాం«దీతోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరఫున న్యాయవాదులు మౌఖిక వాదనలు వినిపిస్తారు. తెల్లం వెంకట్రావు, సంజయ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై రెండు విడతల్లో ఈ నెల 6, 7, 14, 15 తేదీల్లో స్పీకర్ విచారణ జరిపారు.
ఈ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతోపాటు వారిపై పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడా న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే విచారణ చివరి అంకానికి చేరడంతో చివరగా ఇరుపక్షాల తరఫున న్యాయవాదులు స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట మౌఖిక వాదనలు వినిపించనున్నారు. ఈ వాదనలు ముగిసిన తర్వాత స్పీకర్ తన వద్ద దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
స్పీకర్ నిర్ణయమే తరువాయి
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎనిమిది మందిని స్పీకర్ సారథ్యంలోని ట్రిబ్యునల్ రెండు విడతలుగా విచారణ జరిపింది. తొలి విడతలో ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని స్పీకర్ ట్రిబ్యునల్ విచారించింది. రెండో విడతలో తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ కూడా విచారణకు హాజరయ్యారు.
కాగా ఈ నెల 20న రెండో విడత విచారణకు హాజరైన నలుగురు ఎమ్మెల్యేల మౌఖిక వాదనలు కూడా పూర్తి కానున్నాయి. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్‌పై సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో విచారణకు హాజరైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వారం రోజుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెలువడక మునుపే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.


