బంగ్లాదేశీయులకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చారేమో.. రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

MLA Raja Singh Sensational Allegations Over Fake Certificate Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వెలుగుచూసిన నకిలీ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారాయన. పాతబస్తీ కేంద్రంగా నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ జారీ చేశారని, ఈ స్కాంలో ఎంఐఎం పాత్ర కూడా ఉందని ఆరోపించారాయన.  పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు  చెందిన వారికి కూడా సర్టిఫికేట్స్  అంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి  రాగానే కచ్చితంగా సర్జికల్ స్ట్రీక్ నిర్వహిస్తామన్నారు. విదేశీ చొరబాటు దారులను అరికట్టేందుకు ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అమలు కావాలన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎంఐఎంకు భయపడి ఓల్డ్‌ సిటీ వైపు చూడరని ఆయన వ్యాఖానించారు. ఔట్ సోర్సింగ్ ఇచ్చాక వారిపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందని రాజాసింగ్‌ అన్నారు.

ఇదిలా ఉంటే.. ఆన్‌లైన్‌లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే  ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్‌ సర్టిఫికెట్‌లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు .  

అంతేకాదు.. ఫేక్‌ డెత్ సర్టిఫికెట్లతో  బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో  కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు.

పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం
గత డిసెంబర్‌లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top