
శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే
మొదటి మూడు స్థానాల్లో ఇండోనేషియా, కామెరూన్, ఇటలీ
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గురువారం రాత్రి నిర్వహించిన ‘టాలెంట్ గ్రాండ్ ఫినాలే విభిన్న కళలతో అలరించింది. 24 దేశాలకు చెందిన పోటీదారులు ఎంపికైన ఈ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండవ స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. అద్భుతమైన పియానో సంగీతంతో మిస్ ఇండోనేషియా వేదికను సోల్‌ఫుల్ ఫీల్‌లో ముంచెత్తింది. శ్రావ్యమైన పాశ్చాత్య సంగీత వెల్లువతో ‘గుడ్‌నెస్ ఆఫ్ గాడ్’ పాట పాడి మిస్ కామెరూన్ ప్యానెలిస్టుల మనసు దోచుకుంది.
మిస్ ఇటలీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక విశిష్టతను కలిగిన బ్యాలేను ప్రదర్శించింది. ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా చేసిన బాలీవుడ్ హిట్ సాంగ్ దోల్ భాజే సాంగ్ వేదికను దద్దరిల్లేలా చేసింది. భారతీయ సంస్కృతిని మిస్ వరల్డ్ వేదికపై ఘనంగా ప్రదర్శించడం సంతోషంగా ఉందని నందినీ గుప్తా తెలిపారు. చివరగా మొత్తం 24 మంది పోటీదారులు రాను బొంబాయికి రాను, అద్దాల మేడలున్నయే అంటూ తెలుగు పాటలకు స్టెప్పులేశారు. కాగా, అత్యవసర సమయాల్లో రోగులను కాపాడే సీసీఆర్ ఎలా చేయాలో వినూత్నంగా ప్రదర్శించి వేల్స్ కంటెస్టెంట్ తన వైద్య వృత్తి గొప్పదనాన్ని చాటారు.
సింగరేణి స్టాల్స్‌లో సుందరీమణులు
గురువారం సాయంత్రం శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం మిస్‌వరల్డ్ పోటీదారులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు తిలకించారు. వివిధ ప్రాంతాల నుంచి సింగరేణి సేవా సమితిలో శిక్షణ పొందిన మహిళలు తయారుచేసిన బ్యాగులు, చేతి పర్సులు, మగ్గం వర్క్ చేసిన దుస్తులను పరిశీలించి, ఇవి చక్కగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు.