TS: పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

Minister Sabita Review On Tenth Class Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద‍ర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ‘‘పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలి. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీగా పరీక్షలను నిర్వహించాలి.

మే 23వ తేదీ నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఏంఈవో ఫోన్ నెంబర్లను డిస్‌ప్లే చేయాలి.

ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు చేర్చడం జరిగింది. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి హాల్ టిక్కెట్లను పొందాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. పరీక్షలు జరుగుతున్న సమయంలో కరెంట్‌ సప్లైకు అంతరాయం కలగకూడదు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన రీతిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్‌.. ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. 

పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా జిల్లాల వారీగా పరిశీలకులను నియమించడం జరుగుతుంది. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఉండేలా ముందస్తుగానే తనిఖీలను నిర్వహించాలి. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే పరీక్షలను నిర్వహించే నాటికి వాటిని పరిష్కరించాలి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి’’ అని సూచించారు.

ఇది కూడా చదవండి: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌.. తెలంగాణకు భారీ వర్ష సూచన

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top