Sakshi News home page

విద్యార్థులు గ్లోబల్‌ లీడర్లుగా ఎదగాలి 

Published Sun, Dec 11 2022 2:09 AM

Minister KTR Attends 5th Graduation Ceremony Of RGUKT Basar IIIT - Sakshi

బాసర(ముధోల్‌): ప్రతిభ ఎవరి సొత్తూ కాదని, ఐడియాలో దమ్ముంటే ఎవరూ ఆపలేరని, గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలంటే మంచి ఆలోచనలతో నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ లో శనివారం నిర్వహించిన 5వ స్నాతకోత్సవ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ వచ్చే 20 ఏళ్లలో ప్రపంచం పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో నడుస్తుందని, దానికి తగ్గట్టు మనం కూడా రూపాంతరం చెందాలన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని, సమస్యల పరిష్కారానికి దాదాపు రూ.25 కోట్లు అవసరమని కళాశాల అధికారులు కోరగా.. అవి సరిపోవంటూ రూ.27 కోట్లు సీఎం మంజూరు చేశారని వివరించారు. స్టేట్‌ యూనివర్సిటీగా ఉన్న ట్రిపుల్‌ ఐటీని నేషనల్‌ యూనివర్సిటీగా తీర్చిదిద్దే బాధ్యత విద్యార్థులదేనన్నారు.    

ట్రిపుల్‌ ఐటీకి వరాలు
బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులపై కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఇకపై విద్యార్థులకు మిషన్‌ భగీరథ నీళ్లు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి విన్నపం మేరకు నాలుగు వేల మంది విద్యార్థినులు చదువుతున్న ట్రిపుల్‌ ఐటీలో గైనకాలజీ డాక్టర్లు అందుబాటులో ఉండేలా పది పడకల ఆస్పత్రి నిర్మించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు సోలార్‌ ఎనర్జీ అందించి, క్యాంపస్‌ లోని చెరువును సుందరీకరణ చేస్తామని, విద్యా ర్థుల అవసరాల మేరకు సైన్స్‌ల్యాబ్‌ ఏర్పాటు చేస్తా మని తెలిపారు. వీటికి అవసరమయ్యే దాదాపు రూ.5కోట్లు త్వరలో మంజూరు చేస్తామన్నారు.

ల్యాప్‌టాప్‌లు ప్రదానం 
గత సెప్టెంబర్‌లో ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన కేటీఆర్‌ విద్యార్థులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీనిచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ శనివారం స్థానిక కాన్ఫరెన్స్‌ భవనంలో పలువురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ప్రదానం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో 38మంది విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వీసీ వెంకటరమణ, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement