హైదరాబాద్: యోనిలో రక్తనాళాల కణితి కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళ (41)కు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ చికిత్సతో ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో డాక్టర్ టి.రఘుతేజస్వీ మాట్లాడుతూ... వజైనల్ హీమాంజియోమో చాలా అరుదుగా కనిపించే సమస్య అని తెలిపారు. ఒకసారి తీవ్ర రక్తస్రావం ప్రారంభమైతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుందన్నారు.
ముందుగా రోగి ఆరోగ్యాన్ని కుదుట పరిచి.. అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతతో సూక్ష్మ క్యాథెటర్ ద్వారా కణితికి రక్తాన్ని సరఫరా చేస్తున్న నాళాలను మూసివేశామన్నారు. దీంతో రక్తస్రావం వెంటనే అదుపులోకి వచ్చిందన్నారు. పెద్దగా చికిత్స అవసరం లేకుండా రోగి కోలుకుని ఆరోగ్యంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జె.శాలిని నారాయణ్, సాయితేజ నమాల తదితరులు పాల్గొన్నారు.


