మరుగుదొడ్డే ఆమెకు ఆవాసం ..‘ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి’

Medak: Old Woman Living In Toilet With Sick Son, Seeks Help - Sakshi

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో నివాసం

భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వృద్ధురాలు

మరో ఇద్దరు కొడుకులున్నా  పట్టించుకోని వైనం 

సాక్షి, మెదక్‌: అందరూ ఉన్న అనాథ. కుమారులు పట్టించుకోకపోవడంతో ఆసరా కరువై వృద్ధురాలు భిక్షాటనచేస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా చిన్న కుమారుడితో కలిసి రోడ్డు భవనాలశాఖకు చెందిన గెస్ట్‌హౌస్‌ మరుగుదొడ్డిలో తలదాచుకుంటోంది. తల్లీకుమారుల దయనీయస్థితిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట పట్టణానికి చెందిన జెట్టి రామలక్ష్మి భర్త భాస్కర్‌ గతంలోనే మృతిచెందాడు. దీంతో ఆమె కష్టపడి కూలీపనులు చేసి ముగ్గురు కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసింది.

పెద్ద కుమారుడు తన భార్యాపిల్లలతో పక్క గ్రామంలోని అత్తగారింటిలో స్థిరపడ్డాడు. బీసీ కాలనీలో ఉంటున్న రెండో కొడుకు కూలీపనులు చేసుకుంటూ తన బార్యా పిల్లను పోషించుకుంటున్నాడు. మూర్చవ్యాధితో తరచూ అనారోగ్యానికి గురవుతున్న మూడో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి తల్లి రామలక్ష్మి  బీసీ కాలనీలోని అద్దె ఇంటిలో నివాసం ఉండేది. అనారోగ్యంతో శ్రీనివాస్‌ సరిగా పనులు చేసుకోకపోవడంతో  అతడి భార్య ఇద్దరు కూతుర్లను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.  

ఇదే క్రమంలో అద్దె ఇల్లు  యజమాని ఇల్లు ఖాళీ చేయించడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో రామలక్ష్మి తన కుమారుడితో పట్టణంలోని మెదక్‌ రోడ్డులో శిథిలమైన రోడ్డు భవనాల శాఖకు చెందినన గెస్ట్‌హౌస్‌ మరుగుదొడ్డిలో తలదాచుకుంటుంది. కూలీ పనులు చేయాలన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో తల్లీకొడుకులు కొన్నాళ్లూ అర్థాకలితో గడిపారు.

దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో రామలక్ష్మి భిక్షటన చేపట్టింది. తనకు వస్తున్న పించన్‌ డబ్బుతోపాటు భిక్షాటన ద్వారా వచ్చింది తింటూ తల్లీకొడుకులు కాలం గడపుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమకు మందులకోసం ప్రతినెలా రూ.1500 ఖర్చవుతోందని వృద్ధురాలు వాపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గత నెలనుంచి మందులు కూడా వేసుకోవడంలేదని కంటతడి పెట్టింది.  

రెండు పడకల ఇళ్లు మంజూరు చేయాలి
దయనీయ పరిస్థితిలో అర్థాకలితో అలమటిస్తున్న తల్లీకొడుకులు మూడు నెలలుగా మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ప్రతిరోజూ పట్టణంలో భిక్షాటన చేస్తున్న రామలక్ష్మిని చూస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఎవరూ ఆసరా ఇవ్వకపోడంతో భిక్షాటన ఎంచుకుంది.  డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరుచేయాల్సిన అవసరం ఉంది.

ఆకలితో అలమటిస్తున్నాం ఆదుకోండి 
కొంతకాలంగా నేను, చిన్నకుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాం. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. అద్దె ఇంటిలో ఉండేవాళ్లం. ఇంటి యజమాని ఖాళీ చేయించడంతో విధిలేక మరుగుదొడ్డిలో ఉంటున్నాం. పూటగడిచే మార్గంలేక సిగ్గువిడిచి భిక్షాటన చేస్తున్నా. పించన్‌ డబ్బులు,  భిక్షాటన ద్వారా వస్తున్న డబ్బులు మందులకు కూడా సరిపోవడంలేదు.  ప్రభుత్వపరంగా ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలి.  
– జెట్టి రామలక్ష్మి, వృద్ధురాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top