మెదక్‌ ఘటన: పనికోసం నమ్మి వెళ్తే.. బీమా ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్‌!

Medak Car Burn Case: Driver Died In Dharma Insurance Money Plan - Sakshi

సాక్షి, మెదక్‌/హైదరాబాద్‌: మెదక్‌ కారు దహనం కేసులో అనూహ్య ట్విస్ట్‌ నెలకొన్న విషయం తెలిసిందే. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం నాటకం ఆడి సెక్రెటేరియేట్‌ ఉద్యోగి ధర్మా అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.  అయితే ధర్మా ఆడిన నాటకంలో డ్రైవర్‌ బలి పశువుగా మారాడు. పనికి వెళ్తే నాలుగు పైసలు వస్తాయని ఆశించిన వ్యక్తి ఊహించని విధంగా విగతజీవిగా మారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడు.

చనిపోయింది ఎవరు ?  
ధర్మానాయక్‌కు రెగ్యులర్‌ డ్రైవర్‌ లేడు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని రోజువారీ కిరాయి ఇస్తానని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్‌ చేశాడు. 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కారులో ఆ డ్రైవర్‌ మృతదేహాన్ని ఉంచి పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్టు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఇదంతా చేశాడని, దీని కోసమే రెండు నెలల క్రితం సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేశాడు. డ్రైవర్‌తో సహా కారును సజీవదహనం చేశాక ధర్మానాయక్‌ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పిన తర్వాత సమీప అటవీ ప్రాంతం గుండా షాబాద్‌ తండాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి మరో వాహనంలో పరారయ్యాడు. మృతుడి స్వస్థలం బీహార్‌గా భావిస్తున్నారు.

నవీన్‌పేటలో స్కెచ్‌ 
ధర్మానాయక్‌ అక్క నిజామాబాద్‌ జిల్లాలోని నవీన్‌పేటలో ఉంటుంది. అక్క కొడుకుతో కలిసి ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం పథకం వేసినట్టు ప్రచారం జరుగుతోంది.  సహకరిస్తే పెళ్లికి సాయంతోపాటు, కొంతడబ్బు కూడా ముట్టజెప్పుతానని ఆశ చూపినట్టు సమాచారం.  

బెట్టింగ్‌లు ఆడి... 
ధర్మా కొంతకాలంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్‌ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్‌ఐసీ పాలసీల క్లెయిమ్‌ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్‌ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్‌ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

మండిపడుతున్న తండావాసులు 
డబ్బు కోసం ధర్మానాయక్‌ ఈ ఘటనకు ఒడిగట్టడంపై తండావాసులు మండిపడుతున్నారు. మంగళవారం మీడియా బృందం తండాకు చేరుకొని ధర్మానాయక్‌ భార్య నీల, ఇతర కుటుంబసభ్యు లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వా రు నోరు మెదపలేదు. మెదక్‌ డీఎస్పీ, అల్లాదుర్గం సీఐ, మెదక్‌ సీఐ, టేక్మాల్‌ పోలీసులు ఘటనా స్థలానికి ధర్మా నాయక్‌ను తీసుకొచ్చి వివరాలు సేకరించినట్టు సమాచారం. ధర్మానాయక్‌ కస్టడీలో ఉన్నా తమకేమీ సమాచారం లేదంటూ పోలీసులు  సమాధానం  ఇస్తున్నారు.  

అసలు ఏం జరిగిందంటే
ఈనెల 9న టేక్మాల్‌ మండలం వెంకటాపూర్‌ చెరువు కట్ట సమీపంలో కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.  ఆ కారు సెక్రెటేరియేట్‌లో పనిచేసే ధర్మనాయక్‌ది అని, చనిపోయిందని అతనేనని భావించారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు అనేక సందేహాలు రేకెత్తాయి. కారు దహనమైన చోట పెట్రోల్‌ బాటిల్‌ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ధర్మానాయక్‌ కుటుంబసభ్యుల ఫోన్‌ కాల్స్, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో కేసు మరో మలుపు తిరిగింది. డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకోమంటూ ధర్మానాయక్‌ చేసిన మెసేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా.. చనిపోయింది ధర్మానాయక్‌ కాదనే ఓ అంచనాకు వచ్చారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పూణే సమీపంలో ధర్మానాయక్‌ ఉన్నట్టు గుర్తించారు. మంగళవారం టేక్మాల్‌కు తీసుకొచ్చి పోలీసులు విచారించారు. ఆపై మెదక్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top