రానున్న ఐదు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు
ఉత్తర ప్రాంత జిల్లాల్లో 40 డిగ్రీలకు పైబడి నమోదుకు అవకాశం
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం
40 డిగ్రీలు దాటిన జిల్లాల్లో హీట్‌వేవ్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, రెండ్రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండోవారం నుంచే ఎండల తీవ్రత నమోదైంది. ఆ తర్వాత వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ నెల మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగినా, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం వేసవి సీజన్ తీవ్రత ప్రారంభమైంది. ఏప్రిల్ మూడో వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాల్సి ఉండగా... ఇప్పుడు కొన్నిచోట్ల అంతకు మించి నమోదవుతున్నాయి.
శుక్రవారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరగనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా ఉత్తరాది జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సూచించింది.
వరుసగా నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా కొనసాగితే వడగాల్పులకు అవకాశం ఉంటుందని, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 18.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్ట్లు వాతావరణ శాఖ వివరించింది.
శుక్రవారం ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లో)
...................................................
కేంద్రం గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్ 40.6 23.7
భద్రాచలం 38.4 24.8
దుండిగల్ 38.0 23.5
హకీంపేట్ 37.9 23.6
హనుమకొండ 37.0 22.0
హైదరాబాద్ 38.2 23.8
ఖమ్మం 38.0 21.6
మహబూబ్‌నగర్ 39.4 24.6
మెదక్ 38.6 18.3
నల్లగొండ 36.0 21.0
నిజామాబాద్ 39.6 25.3
రామగుండం 37.8 22.6


