ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు! | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు!

Published Sun, Sep 19 2021 12:50 AM

Management Work Of Irrigation Projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే.. చేసిన పనులకు బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇకపై ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)కే అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు నమ్మడంలేదు. చాలాఏళ్ల కిందట చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. పైగా, ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.  

అధికారమున్నా నిధులు సున్నా 
రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిలో గేట్లు, జనరేటర్లు, రోప్‌వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపుమొక్కల తొలగింపు, పెయింటింగ్, గ్రీజింగ్, గ్యాంట్రిక్‌ క్రేన్లు, ఎలక్ట్రీషియన్, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటివన్నీ ఓ అండ్‌ ఎంలో భాగంగా చేపట్టాలి. వీటి నిర్వహణకు ఏటా రూ.280 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను గ్రీన్‌చానల్‌లో విడుదల చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చింది.

అత్యవసర పనులకు వ్యక్తిగత స్థాయిలోనే నిధులు విడుదల చేసే అధికారాన్ని ఈఎన్‌సీ మొదలు ఈఈల వరకు కట్టబెట్టింది. కోటి వరకు ఈఎన్‌సీ (జనరల్‌), రూ.50 లక్షల వరకు సీఈ, రూ.25 లక్షల దాకా ఎస్‌ఈలకు, రూ.5 లక్షల వరకు ఈఈలకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి విడుదలైన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్‌ ఎంకు సంబంధించిన బిల్లులు రూ.20 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి.  

ఈ ఏడాది సైతం... 
ఈ ఏడాది 19 డివిజన్ల పరిధిలో 613 రకాల ఓ అండ్‌ ఎం పనులను రూ.65 కోట్లతో చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే చాలాచోట్ల ఇంజనీర్లు టెండర్లు పిలుస్తున్నా స్పందన రావడం లేదు. నాగార్జునసాగర్‌ పరిధిలో రూ.35 లక్షల సివిల్‌ పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి టెండర్‌ పిలిచారు. ఎస్సారెస్పీ పరిధిలో మరమ్మతులు, మట్టి పనులకు రూ.50 లక్షలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లలో ఉలుకూపలుకూలేదు.

ఇక జూరాల పరిధిలో మెకానికల్‌ పనులు, హెడ్‌రెగ్యులేటర్, షట్టర్ల పనులకు రూ.25–30 లక్షలతో మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్‌–2 పనులకూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవో 20 కింద పంప్‌హౌస్‌ల నిర్వహణ నిమిత్తం రూ.100 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసినా, నిధుల విడుదల ఉంటుందా.. ఉండదా.. అనే సంశయం మాత్రం వారిని వెంటాడుతోందని ఇరిగేషన్‌ వర్గాలే అంటున్నాయి. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement