హైదరాబాద్‌లో వర్షాలు: గల్లంతైన వ్యక్తి మృతి

Man Drowned In Flood Water At Hyderabad Saroornagar Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ చెరువులో ఆదివారం సాయంత్రం గల్లంతైన నవీన్ కుమార్‌ విగతజీవిగా మారాడు. అతని మృతదేహం నేడు లభ్యమైంది. నిన్న గల్లంతైన ప్రదేశానికి 30 మీటర్ల దూరంలో నవీన్‌ మృతదేహాన్ని గుర్తించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. స్కూటీపై వెళ్తూ నిన్న సరూర్‌నగర్‌ చెరువులో నవీన్ గల్లంతైన సంగతి తెలిసిందే. బాలాపూర్‌ మండలం అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌ (32) ఎలక్ట్రీషియన్‌. సరూర్‌నగర్‌ చెరువుకట్ట కింద నుంచి తపోవన్‌ కాలనీ మీదుగా సరూర్‌నగర్‌ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై వెళ్తున్నాడు.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తపోవన్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–6 నుంచి చెరువులోకి వడిగా వరదనీరు ప్రవహిస్తోంది. వరద నీటిని దాటే క్రమంలో స్కూటీ అందులో కొట్టుకుపోయింది. అనంతరం నవీన్‌కుమార్‌ కూడా వరదలో కొట్టుకుపోయి చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానిక కాలనీవాసులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి నవీన్‌కుమార్‌ ఆచూకీ తెలుసుకునేందుకు గజ ఈతగాళ్లను, అధునాతన బోట్లను రంగంల్లోకి దించినా ఫలితం లేకపోయింది. నవీన్‌ మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతన్నారు.
(చదవండి: వరద నీటిలో వ్యక్తి గల్లంతు)

ఆచూకీ కోసం 20 గంటల శ్రమ
సరూర్‌సగర్‌ చెరువలో గల్లంతైన నవీన్‌ కుమార్‌ ఆచూకీ కోసం నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టాయి. సుమారు 20 గంటలు శ్రమించి నవీన్‌ కుమార్‌ మృతదేహాన్ని వెలికి తీశాయి. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఎంతో శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలను అభినందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి తక్షణమే పదివేల రూపాయల ప్రోత్సాకాహకాన్ని అందచేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందేలా చూస్తామని చెప్పారు.
(చదవండి: ఉసురు తీసిన నాలా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top