నిధులు దోపిడీ చేస్తున్న కేసీఆర్: భట్టి

Mallu Bhatti Vikramarka Visited Sriram Sagar Project - Sakshi

తెలంగాణ నిధులు దోపిడీ చేస్తున్న కేసీఆర్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు

సాక్షి, నిజామాబాద్‌ : కొన్నిలక్షల ఎకరాలకు నీళ్లు పారేలా.. ఈ ప్రాంతానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు అందించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో ముఖాముఖీలో భాగంగా ఆయన ఆదివారం శ్రీరామ్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్టును అందించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు. నేడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, జీవన స్థితిగతులు పెరిగిన అందుకు ఆధునిక దేవాలయాలైన ఇలాంటి ప్రాజెక్టులు కారణం అని అన్నారు.

ఇలాంటి ప్రాజెక్టులు పెరు చెప్పి, వాటికి కాస్త సున్నం వేసి.. వాటికి వారి పేర్లు పెట్టుకునే సంస్కృతికి టీఆర్ఎస్ నాయకులు దిగజారారని భట్టి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీ డిజైన్ పేరుతో మార్చారని మండి పడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 7 జిల్లాలకు మంచి నీరు, పరిశ్రమలకు నీటి సదుపాయంతో సహా 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని భట్టి వివరించారు.

కేసీఆర్ కేవలం ధనదాహంతో నీళ్లు తెలంగాణలో పారకుండా రీ డిజైన్ పేరుతో అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ప్రాజెక్టు అంచనాలను విపరీరంగా పెంచి రూ. లక్ష 15 వేల కోట్లకు పెంచారని చెప్పారు. కేసీఆర్ అత్యాశ వల్ల తెలంగాణ నష్టపోతోందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వద్ద పసుపు కుంకుమ జల్లి.. మా వల్లే ఈ నీళ్లు పారుతున్నాయని చెప్పుకోవడం.. అత్యంత బాధాకరమని భట్టి చెప్పారు. రాష్ట్ర నిధులు.. నీళ్లు దోపిడీకి గురి అవుతున్నాయని భట్టి విక్రమార్క మీడియాతో అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top