‘భగీరథ’కు ‘మల్లన్న’ నీరు

Mallannasagar Reservoir Water For Mission Bhagiratha - Sakshi

ఏటా 10 టీఎంసీలు వినియోగానికి నిర్ణయం

సిద్దిపేటతోపాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్‌ జిల్లాలకు సరఫరా

హైదరాబాద్‌ లైన్‌పై భారం తగ్గించడమే లక్ష్యం 

మంగోల్‌ వద్ద వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మాణం 

రూ.674 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం

గజ్వేల్‌: త్వరలో పూర్తి కానున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ సాగునీటికే కాదు మిషన్‌ భగీరథ ద్వారా అందించే తాగు నీటికి కూడా ఆధారం కానుంది. ఇక్కడి నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోనున్నారు. సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్‌ జిల్లాల్లో భగీరథ నీటి సరఫరాకు మల్లన్నసాగరే ప్రధాన వనరు కానుంది. ప్రస్తుతం ఆ జిల్లాలకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే లైన్‌ నుంచి వాడుకుంటున్నారు. ఈ లైన్‌పై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్‌ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదైన 540 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ ఫర్‌ డే) సామర్థ్యం కలిగిన డబ్ల్యూటీపీ (వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) నిర్మిస్తున్నారు. రూ.674 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు సాగుతున్నాయి.  

జంట నగరాల్లోని పలు ప్రాంతాలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి సుజల స్రవంతి పథకాన్ని ఎనిమిదేళ్ల క్రితం రూ.3,375 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట సమీపంలోని ఘనపూర్‌ వద్ద నిర్మించిన డబ్ల్యూటీపీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రతినిత్యం ఈ లైన్‌ ద్వారా 735 ఎంఎల్‌డీ నీటి సరఫరా జరుగుతోంది. ఈ లైన్‌పై కొండపాక, ప్రజ్ఞాపూర్‌ వద్ద సిద్దిపేట, జనగామ జిల్లాల అవసరాల కోసం నీటిని ట్యాపింగ్‌ చేస్తున్నారు. ఘనపూర్‌ డబ్ల్యూటీపీ వద్ద నుంచి యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాలకు పంపుతున్నారు.

దీనివల్ల హైదరాబాద్‌ నగరానికి వెళ్లే నీటిలో అప్పుడప్పుడు కొరత ఏర్పడుతోంది. నీరు తక్కువగా వచ్చినప్పుడు ఆయా జిల్లాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి నీటి సరఫరా అంతరాయం ఏర్పడి తాగునీటికి అల్లాడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్‌లో మిషన్‌ భగీరథ స్ఫూర్తికి అవరోధం ఏర్పడే అవకాశముంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలో మల్లన్నసాగర్‌ నీటిని మిషన్‌ భగీరథ కోసం వాడుకోవాలని నిర్ణయించారు.  

పూర్తయితే స్వయం ప్రతిపత్తే.. 
ఇందుకోసం రూ.674 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి.. టెండర్‌ పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ప్రస్తుతం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగునీటి కొరత తీర్చబోతున్నది. అంతేకాకుండా ఇందులో ఏటా 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడుకుంటారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోల్‌ వద్ద రాష్ట్రంలోనే అతి పెద్దదిగా 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో డబ్ల్యూటీపీ పనులు ప్రారంభమయ్యాయి. మల్లన్నసాగర్‌ నుంచి నీటిని ఇందులో శుద్ధిచేసి ఆయా జిల్లాలకు సరఫరా చేస్తారు. పనులు పూర్తి కాగానే గతంలో హైదరాబాద్‌ లైన్‌పై ఉన్న ట్యాపింగ్‌లను మూసివేస్తారు.

అందువల్ల హైదరాబాద్‌ లైన్‌పై ఎలాంటి అవరోధం లేకుండా నీరు పంపిణీ అవుతుంది. అలాగే సిద్దిపేటతో పాటు జనగామ, మేడ్చల్, యాదాద్రి, మెదక్‌ జిల్లాల భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి ఏర్పడనుంది. కొత్తగా చేపడుతున్న పనుల వల్ల ఆయా జిల్లాల్లోని సిద్దిపేట, జనగామ, పాలకుర్తి, ఘనపూర్, గజ్వేల్, దుబ్బాక, ఆలేరు, భువనగిరి, మేడ్చల్‌ తదితర నియోజకవర్గాలకు ప్రయోజనం కలగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న 16 మున్సిపాలిటీలకు కూడా మేలు జరగనుంది.

భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా..
సిద్దిపేటతో పాటు నాలుగ జిల్లాల్లో మిషన్‌ భగీరథ పథకం నీటి సరఫరాకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇందుకోసం మల్లన్నసాగర్‌ను ప్రధాన వనరుగా మార్చుకొని మంగోల్‌ వద్ద డబ్ల్యూటీపీ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి నుంచి ఆయా జిల్లాలకు నీటిని సరఫరా చేస్తాం. దీని ద్వారా హైదరాబాద్‌ లైన్‌పై ఎలాంటి భారం ఉండదు. అంతేకాకుండా ఈ జిల్లాల్లో మిషన్‌ భగీరథ పథకానికి స్వయం ప్రతిపత్తి రానుంది. ఇందుకోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  
– రాజయ్య, మిషన్‌ భగీరథ ఈఈ, గజ్వేల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top