Banjara Hills: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు

Luxury Cars Stopped By Banjara Hills Police Over Traffic Challan - Sakshi

నిబంధనలు పాటించని ఖరీదైన కార్లపై..ట్రాఫిక్‌ పోలీసుల కొరడా

స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు హై ఎండ్‌ కార్ల భరతం పట్టారు. ఈ రెండు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా తిరుగుతున్న ఖరీదైన కార్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి.

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్టడీ సర్కిల్, తాజ్‌ మహల్‌ హోటల్, టీవీ చౌరస్తా, కళింగ కల్చరల్‌ సెంటర్‌ చౌరస్తా, తాజ్‌కృష్ణ ఎదురుగా బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, సైఫాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి ట్రాపిక్‌ పోలీస్‌ స్టేషన్లకు చెందిన ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి తనఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా నడుపుతున్న ఓ వ్యక్తి కారును సీజ్‌ చేశారు.

► నంబర్‌ ప్లేటు లేకుండా తిరుగుతున్న నాలుగు కార్లను సీజ్‌ చేశారు. ఈ అయిదు కార్లపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు.  
►బ్లాక్‌ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 35 మంది కారు యజమానులకు ఒకొక్కరికి రూ. 700లు చొప్పున జరిమానా విధించారు. ఇర్రెగ్యులర్, ఇన్‌ప్రాపర్‌ నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 32 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు.  
►ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 39 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా తిరుగుతున్న మూడు కారు యజమానులకు రూ. 2000ల ప్రకారం జరిమానా విధించారు. 

జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో..
► జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, నీరూస్‌ జంక్షన్, రోడ్‌ నంబర్‌ 45, ఫిలింనగర్, రోడ్‌ నంబర్‌ 36 కళాంజలి వద్ద జూబ్లీహిల్స్‌ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ ముత్తు, మారేడుపల్లి, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల నుంచి అయిదు చోట్ల స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.  
► బ్లాక్‌ ఫిల్మ్‌లతో తిరుగుతున్న 48 టాప్‌ మోడల్‌ కార్ల యజమానులకు రూ. 700ల ప్రకారం జరిమానా విధించారు.  
► ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 13 వాహనాలపై జరిమానా విధించారు.  
► ఇంప్రాపర్, ఇర్రెగ్యులర్‌ నంబర్‌ ప్లేట్లతో ప్రయాణిస్తున్న 45 కార్లకు రూ. 200ల వంతున జరిమానా విధించారు. నంబర్‌ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 2 వాహనాలపై చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. సర్వీసు రోడ్డులో పార్కింగ్‌ చేసిన ఒక వాహనంపై జరిమానా విధించారు.  
► ఇద్దరు వాహనదారులపై 41(ఐ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కల్గిస్తున్న ఒక వాహనదారుడిపై కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్‌ చేసిన ఇద్దరు వాహనదారులకు జరిమానా విధించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top