ప్రతినెలా కొద్దికొద్దిగా డిజిటల్ రూపంలో కొనండి
భారీగా పెరిగిన తర్వాత కొద్దిగా పడటం సహజమే..
2000, 2008, 2014 ఇదే విధంగా పడి పెరిగింది
ఇప్పుడు రూ.1.40 లక్షల వద్ద కన్సాలిడేట్ అవుతోంది
వడ్డీరేట్ల పెంపు, యుద్ధ భయాలు తగ్గగానే
రెండు లక్షల మార్కును తాకుతుంది
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఐలా కమోడిటీస్ ఇండియా డైరెక్టర్ హరీశ్ గాలిపెల్లి
భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనవద్దంటూ ఒకపక్క ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని ప్రైవేటు సంస్థలు ‘అవసరాలకు మీ దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టడం కాదు.. పూర్తిగా అమ్మేయండి’ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో సామాన్యులకు అర్థం కావడం లేదు. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా.. కొనాలా లేక అమ్మాలా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో బంగారం.. ఎప్పటికీ బంగారమేనని దీర్ఘకాలిక దృష్టితో ప్రతీ నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమే ఆర్థికంగా ఎంతో మంచిదని అంటున్నారు.. కమోడిటీస్ ఎక్స్‌పర్ట్, ఐలా కమోడిటీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ హరీశ్ గాలిపెల్లి. బంగారం ధరలు పెరుగుతుండటంతో గోల్డ్ లోన్స్ వ్యాపారం పెరిగిందని పేర్కొన్న ఆయన, ‘ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరడంతో అమ్మేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మి మీరు బంగారం అమ్ముకోవద్దు’ అని స్పష్టంచేస్తున్నారు. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని అంశాలు..
సాక్షి, అమరావతి: బంగారం దీర్ఘకాలిక చరిత్రను పరిశీలిస్తే అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. 2000, 2008, 2014ల ర్యాలీని గమనిస్తే.. బాగా పెరిగిన తర్వాత 20 నుంచి 30 శాతం సర్దుబాటు జరిగి తిరిగి పెరగడం ప్రారంభించింది. ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 5,600 డాలర్లకు చేరిన తర్వాత 4,000 డాలర్లకు పడిపోయింది. జూలైలో 4,100 డాలర్ల వద్దే కదలాడి ఆగస్టులో 4,500–4,600కు చేరింది. ప్రస్తుతం బంగారం కన్సాలిడేషన్ మూడ్‌లోనే ఉంది. సర్దుబాటు పూర్తయిన తర్వాత పాత రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డు స్థాయిలకు వెళుతుంది.
ప్రభావితం చేస్తున్న అంశాలేంటంటే..
ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీరేట్ల పెంపు, యుద్ధ భయాలు ప్రధానంగా బంగారం ధరలను నిర్దేశించే మూడు అంశాలు. వచ్చే 6 నెలల ధరలను ఈ మూడే ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ధరల పెరుగుదల అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది. ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి అమెరికా వడ్డీరేట్లు పెంచితే డాలరు బలపడి ఆ సమయంలో బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉంది. అప్పుడు కూడా 4,000–4,200 డాలర్ల వద్దే కదులుతుందని అంచనా.
ఇది మంచి మార్గం
పెట్టుబడి సాధనాల్లో బంగారం ప్రధానమైనదనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకేసారి కాకుండా క్రమానుగతంగా లేదా పడుతున్నప్పుడల్లా కొనుగోలు చేస్తూ ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గోల్డ్ బీస్, గోల్డ్ ఈటీఎఫ్ వంటి డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయండి. గడచిన ఐదేళ్లుగా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు డిమాండ్ పెరిగింది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లానే గ్రామీణ ప్రాంతాల ప్రజలూ గోల్డ్ ఈటీఎఫ్‌లవైపు చూస్తున్నారు. నేరుగా బంగారం కంటే డిజిటల్ రూపంలో కొనాలి. సులభతర లావాదేవీలు, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి మార్గం.


