Goplapur గాంధీ స్ఫూర్తితో గోప్లాపూర్‌ గ్రామస్తుల ఆదర్శ నిర్ణయం

Liquor Ban: Liquor Prohibition Successfully Implementing In Gopalpur Village - Sakshi

గాంధీ జయంతి స్ఫూర్తితో గోప్లాపూర్‌లో మద్య నిషేధం

ఐదేళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేధం

విక్రయించినా.. కొనుగోలు చేసినా రూ.10 వేల జరిమానా

కలిసికట్టుగా అభివృద్ధికి గ్రామస్తుల బాటలు

పాన్‌గల్‌: మహాత్మాగాంధీ స్ఫూర్తితో మహబూబ్‌నగర్‌ జిల్లా పాన్‌గల్‌ మండలం గోప్లాపూర్‌లో సంపూర్ణ మద్య నిషేధం విజయవంతంగా అమలవుతోంది. మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా మద్య నిషేధం కొనసాగిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అంతకుముందు గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా మద్యం తీసుకోవడంతో తరచూ గొడవలు చోటుచేసుకుని అశాంతి వాతావరణం నెలకొనేది. ఈ క్రమంలో విద్యావంతులు, యువకులు ఈ చెడు సంస్కృతిని పారదోలేందుకు నిర్ణయించుకున్నారు.
చదవండి: మణికొండ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్‌ 


గోప్లాపూర్‌లో మద్య నిషేధంపై ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు (ఫైల్‌)

చిన్నాపెద్ద, మహిళలు, యువత ఒక తాటిపైకి వచ్చి మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. మద్యం విక్రయించినా.. కొనుగోలు చేసినా రూ.10 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ మేరకు 2016 జూలై 11వ తేదీ నుంచి గ్రామంలో గుడుంబా, గొలుసు మద్యం దుకాణాల పై విధించిన నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు ​​​​​​​

వేలం పాట నిర్వహించి.. 
గోప్లాపూర్‌లో 4 వేల వరకు జనాభా.. 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఐదేళ్ల కిందట గ్రామంలో మద్యం విక్రయించేందుకు వేలంపాట పాడారు. మద్యం విక్రయాలు దక్కించుకున్నవారు ఇష్టానుసారంగా ధరలకు విక్రయించేవారు. దీంతో మద్యం మత్తులో గొడవలు జరగడం, డబ్బు వృథా కావడం, అప్పులు పెరిగి కుటుంబ పోషణ భారంగా మారింది. ఎంతో మంది ఆర్థికంగా కుంగిపోతుండడంతో యువకులు, గ్రామస్తులు సమావేశమై మద్యం భూతాన్ని తరిమేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఐదేళ్ల కిందట మహిళలు, యువకులు ఏకమై గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం నిషేధంపై గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం విక్రయించరాదని, కొనుగోలు చేసినా రూ.10 వేలు జరిమానా విధించాలని తీర్మానించారు. గ్రామస్తులంతా పార్టీలకతీతంగా సమష్టి కృషితో యువకులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి మద్య నిషేధంపై ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆలయం ఎదుట ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతోంది. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతోపాటు గ్రామాభివృద్ధికి దోహదపడుతుంది. 

ప్రశాంతంగా ఉంది 
గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుతో ప్రశాంతంగా మారింది. గ్రామస్తులు, యువకుల సహకారంతో అందరం కలిసికట్టుగా పార్టీలకతీతంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి బాటలు వేయడంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఎలాంటి గొడవ లేకుండా హాయిగా పనులు చేసుకుంటున్నాం. 
- కృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు, గోప్లాపూర్‌

గొడవలు తగ్గాయి.. 
గతంలో గ్రామంలో మద్యం విక్రయాలతో కొందరు ఇష్టారాజ్యంగా తాగేవారు. దీంతో గ్రామంలో గొడవలు, మహిళలపై దాడులు తరచూ జరిగేవి. సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిర్ణయం తీసుకోవడంతో గ్రామంలో అందరూ ఆనందంగా ఉన్నారు. నిషేధాన్ని ఇకపై ఇలానే కొనసాగిస్తాం.
- లక్ష్మీ, మాజీ సర్పంచ్, గోప్లాపూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top