టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ 

Konda Vishweshwar Reddy Gives Clarity On New Party - Sakshi

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పని అయిపోయింది: మాజీ ఎంపీ కొండా

సాక్షి, తాండూరు టౌన్‌: టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులతో కలిసి రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ వ్యతిరేకులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరుకు వచ్చిన కొండా పలువురు స్థానిక నేతలను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. తాను టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ పోరాడే తత్వాన్ని మరిచిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరందరూ కలిసొస్తే కొత్త పార్టీకి రెడీ అని, తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టేది లేదని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో బీజేపీలో చేరుతానని తెలిపారు. ఇప్పటికే తాను కోదండరాం, తీన్మార్‌ మల్లన్న, చెరుకు సుధాకర్, మహబూబ్‌ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులను కలిశానని, త్వరలోనే రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఒకప్పటి కాంగ్రెస్‌ నేతలు సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి వలె అమ్ముడుపోయే నేతలను కలుపుకొనిపోయే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేకమంది కోవర్టులు ఉన్నారని కొండా ఆరోపించారు. ఆయనతో పాటు టీజేఎస్‌ తాండూరు నేత సోమశేఖర్, కాంగ్రెస్‌ నేత రఘునందన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top