సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలు,కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ లను రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేశంలో మరో సత్యాగ్రహ పోరాటం మొదలైంది. రాజ్యాంగబద్ద సంస్థల పరిరక్షణపై రాహుల్ గాంధీ పోరాటం ద్వారా దేశంలో మరో సత్యాగ్రహ పోరాటం మొదలైందన్నారు.అందుకే బీజేపీ భయపడి దేశ రాజధానిలో ఆంక్షలు విధించిందన్నారు. ఆంక్షలు బీజేపీ పిరికిపంద చర్యకు నిదర్శనమన్నారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగబద్ధమైన హక్కు. కానీ బీజేపీ పోలీసు బలగాలను అడ్డుపెట్టుకొని ప్రజా స్వామ్యాన్ని నిర్బంధించాలని యత్నిస్తోందన్నారు. ఈసీ కార్యాలయం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదన్నారు
ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా, పోలీసు బలగాలతో నిర్బంధాలు విధించినా కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున, రాజ్యాంగం, రాజ్యాంగబద్ద సంస్థల పరిరక్షణ కోసం పోరాటాన్ని ఆపేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో జ్ఞానేష్ కుమార్ రాజీనామ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.


