సేద తీరేందుకే ఢిల్లీకి కేసీఆర్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి | KCR Delhi Visit Is For Relaxation Says Revanth Reddy | Sakshi
Sakshi News home page

సేద తీరేందుకే ఢిల్లీకి కేసీఆర్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Nov 25 2021 2:37 AM | Updated on Nov 25 2021 2:37 AM

KCR Delhi Visit Is For Relaxation Says Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెల రోజులుగా ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉందని రైతు కన్నీరు మున్నీరవుతుంటే రైతన్నను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహాసమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాజకీయ చదరంగంలో రైతును పావుగా చేసుకుని ఆటలాడుతున్నాయంటూ మండిపడ్డారు. ఆయా పార్టీలు ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తుంటే రైతన్న నిస్సహాయుడై దీనంగా చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
 

రాష్ట్రంలోని రైతుల పరిస్థితి, రాజకీయ అంశాలపై బుధవారం తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎప్పుడో యాసంగి పంటకు సంబంధించిన సమస్యను ఇప్పటి వానాకాలం పంటకు ముడిపెట్టి తడిగుడ్డతో రైతు గొంతు కోసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కల్లంలో రైతు కన్నీరు తుడవాల్సిన సీఎం.. ఇందిరా పార్కు వద్ద ఏసీ టెంటు కింద 2 గంటలు సేదతీరి, ఇప్పడు ఢిల్లీ వెళ్లి అక్కడా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.

ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లడం వెనుక స్వీయ ప్రయోజనాలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఉత్తరమే వరి రైతు పాలిట ఉరి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంట కొనుగోలు విషయంలో గత ఆగస్టులోనే అన్ని రాష్ట్రాలతో ఎఫ్‌సీఐ సమావేశం పెట్టిందని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయని చెప్పారు. ప్రస్తుతం వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా యాసంగి గురించి పంచాయతీ ఏంటని ప్రశ్నించారు. 

మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. 
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వర్షంలో పంట తడిచి మొలకెత్తిందని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుతో పెట్టుకుంటే పాతరేస్తారన్న భయం పాలకుల్లో వచ్చిందని, అందుకే క్షమాపణలు చెప్పి మరీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. ఆ చట్టాలను సమర్థించిన కేసీఆర్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మందికి పైగా అన్నదాతల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అద్భుత సంకల్పాన్ని ప్రదర్శించిన రైతు జాతికి అభినందనలు చెబుతున్నానని పేర్కొన్నారు.  తెలంగాణ రైతాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయిందని, కామారెడ్డి జిల్లాలో పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకుని ఈ విషయం చెబుతున్నానని రేవంత్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement