కరణం మల్లేశ్వరి: తెలంగాణలో వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీ

Karnam Malleswari Says Weightlifting Academy Start In Telangana - Sakshi

ఒలింపియన్‌ కరణం మల్లేశ్వరి హామీ

సాక్షి, హైదరాబాద్‌: ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్‌ వెయిట్‌లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లేశ్వరి మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 69 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆమెతో టీ–స్పోర్ట్స్‌ చైర్మన్, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్‌ రావు వెబీనార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సహకారమిస్తే హైదరాబాద్‌ కేంద్రంగా వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీని ఏర్పాటు చేస్తానని, తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చింది.

తెలంగాణలో ప్రతిభావంతులైన ఎంతోమంది యువ వెయిట్‌లిఫ్టర్లు ఉన్నారని... అయితే వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీ లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదని టీ–స్పోర్ట్స్‌ చైర్మన్‌ జగన్మోహన్‌ రావు తెలిపారు. మల్లేశ్వరి ఫౌండేషన్‌తో కలిసి తెలంగాణ లిఫ్టర్లకు చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. మల్లేశ్వరి హైదరాబాద్‌కు రావాలని ఈ వెబీనార్‌లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి ఆహ్వానించారు. క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సహకారంతో సీఎం కేసీఆర్‌ను కలిసి రాష్ట్రంలో వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాట్లపై చర్చిద్దామని ఆయన అన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top