అశ్వాలే అతడి నేస్తాలు..

Jagityala: Horses Are Good Friends To ​Him He Likes Them Very Much  - Sakshi

గుజరాత్, మహారాష్ట్ర నుంచి కొనుగోలు

ఓవైపు స్వారీ..మరోవైపు వ్యవసాయ పనులకు పేడ వినియోగం

జగిత్యాలఅగ్రికల్చర్‌: జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..అంటూ గుర్రంపై చిరంజీవి ఓ సినిమాలో వెళ్లడం చూస్తుంటే భళే మజాగా ఉంటుంది. అట్లాంటిది అశ్వాల మీద స్వారీ చేయాలనే కోరికతో జగిత్యాల ప్రాంతంలోని కొందరు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వాటిని కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. దీనికితోడు ఇటీవల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు గుర్రాలపై వెళ్లి పనులు చేసుకోవాలనే నిర్ణయానికి బలం చేకూర్చాయి. అశ్వాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. 

గుర్రాలను పెంచుతున్న ముగ్గురు రైతులు   

జగిత్యాల ప్రాంతంలో ముగ్గురు రైతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలు కొనుగోలు చేసి వాటిని పెంచుతున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన అరుణ్‌ క్రాంతి అంతర్గాం సమీపంలో డెయిరీ ఫాం, చేపలఫాం, కోళ్ల ఫాం, వ్యవసాయం కూడా చేస్తున్నాడు. గుర్రాన్ని లక్షకు గుజరాత్‌ నుంచి కొనుగోలు చేసి దానిపై తిరుగుతూ సరదా తీర్చుకుంటున్నాడు. జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ గ్రామానికి చెందిన మారిశెట్టి రవి అనే రైతు రెండు గుర్రాలను రూ.50 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేశారు. ఆ గుర్రాలపై రోజు పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. జగిత్యాల మండలం పెరుకపల్లికి చెందిన బెజ్జంకి హంసయ్య అనే రైతు రెండేళ్లక్రితం చిన్న వయసులో ఉన్న గుర్రాలను రూ.25 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి వాటిని పెంచుతూ మురిసిపోతున్నాడు.

ప్రత్యేకంగా గుర్రాల పెంపకం

గుర్రాలను కొనుగోలు చేసిన రైతులు అరుణ్‌ క్రాంతి, మారిశెట్టి రవి వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ప్రాణంగా చూసుకుంటున్నారు. గుర్రాలకు ప్రతీ రోజు స్నానం చేయించడంతో పాటు పల్లిపిండి, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన దాణాను రోజు ఇస్తారు. దాణాకు నెలకు ఒక్కో రైతు కనీసం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు ప్రతీరోజు పచ్చి మేత ఆహారంగా ఇస్తున్నారు. గుర్రాల శరీర కండ పరిపుష్టికి రోజు కొద్దిదూరమైనా పరుగెత్తిస్తుంటారు. తారు రోడ్డు, కంకర రోడ్లు ఉండడంతో గుర్రాల కాళ్ల డెక్కలు దెబ్బ తినకుండా, గుర్రాల కాళ్లకు నాడెలు కొట్టిస్తున్నారు. ఎక్కువగా మట్టి రోడ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నారు. గుర్రాలకు ఏదైనా అనారోగ్యం వస్తే సమీపంలోని పశువైద్యుల వద్ద చికిత్స చేయిస్తున్నారు. గుర్రాల పేడను పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు.

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top