పట్టణాల్లో ఐటీ వెలవెల! | IT hubs is not progressing: Telangana | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో ఐటీ వెలవెల!

Nov 11 2024 12:51 AM | Updated on Nov 11 2024 12:51 AM

IT hubs is not progressing: Telangana

అట్టహాసంగా ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసినా చేకూరని ప్రయోజనం

పెద్దగా ముందుకురాని కంపెనీలు.. వచ్చిన వాటిలోనూ కొన్ని వెనక్కి

అద్దెలు భారీ స్థాయిలో ఉండటంతో కార్యకలాపాలకు సంస్థల విముఖత

కనీసం స్కిల్‌ సెంటర్ల కోసమైనా వినియోగిస్తే మేలంటున్న ప్రజాప్రతినిధులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: 
రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల నుంచి 1.75 లక్షల చదరపు అడుగుల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలన్నీ కంపెనీలు పెద్దగా రాకపోవడంతో ఎక్కువ శాతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా వాటిని ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత సరైన నిర్వహణ లేదు. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఐటీ హబ్‌లపై దృష్టిపెట్టకపోవడంతో మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోతున్నాయి.

సంప్రదింపులు జరిపే వారేరీ? 
తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్‌్క) నేతృత్వంలో 2019 నుంచి ఒక్కో పట్టణంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసినా కంపెనీలతో సంప్రదింపులు జరిపే వారు లేక ప్రధాన కంపెనీలేవీ ముందుకు రావడం లేదు. నల్లగొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట పట్టణాల్లోని ఐటీ హబ్‌లకు చిన్నాచితక కంపెనీలు వచ్చినా యువతకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వాటిల్లో చేరే వారు కరువయ్యారు.

ఇక హనుమకొండలోని మడికొండలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లో దిగ్గజ ఐటీ సంస్థ టెక్‌ మహీంద్ర ఒక బ్రాంచీని ఏర్పాటు చేసినా ఆ తర్వాత అనివార్య కారణాలతో దాన్ని మూసేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వెనక్కి వెళ్లిపోవడంతో ఐటీ హబ్‌లు అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఫలితంగా జిల్లా కేంద్రాల్లో నివసించే యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

అడ్డగోలుగా అద్దెలు.. 
ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ నిధులతో ఐటీ హబ్‌ల నిర్మాణం జరిగింది. వాటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వారు ఇష్టానుసారంగా భవనాల అద్దెలను నిర్ణయిస్తున్నారు. దీంతో వాటిలో కార్యాలయాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. నల్లగొండ తదితర పట్టణాల్లో నిర్మించిన ఐటీ హబ్‌లలో ఒక చదరవు అడుగుకు (ఎస్‌ఎఫ్‌టీ) అద్దె రూ. 1,400కుపైగా నిర్ణయించడంతో అప్పట్లో పలు కంపెనీలు ముందుకు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లోనే ఎస్‌ఎఫ్‌టీకి రూ.2 వేలు మొదలు 7 వేల వరకు ఉండగా జిల్లాల్లోని ఐటీ హబ్‌లలో అంతమొత్తం వెచి్చంచేందుకు కంపెనీలు ముందుకురావట్లేదు. 

స్కిల్‌ సెంటర్లన్నా ఏర్పాటు చేయాలి.. 
ఐటీ హబ్‌ భవనాల్లో ఇప్పటివరకు సగం అంతస్తుల్లోనూ కంపెనీలు ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని సది్వనియోగపరచుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. కోట్లు వెచి్చంచి స్కిల్‌ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతుండటంతో ఐటీ టవర్లను స్వాధీనం చేసుకొని స్కిల్‌ సెంటర్లకు వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.

పేరొందిన కంపెనీలు రావాలి
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే పేరొందిన ఐటీ కంపెనీలను పట్టణాలకు తీసుకురావాలి. ప్రభుత్వం అందుకు కృషి చేయాలి. – దుర్గాప్రసాద్, కట్టంగూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement