‘మమ్మీ కంగ్రాట్యులేషన్, ఐ లవ్యూ’

Interesting Things Happened In GHMC Mayor And Deputy Mayor Election - Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌ : బల్దియా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం.. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక సందర్భంగా గురువారం పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. 
► మేయర్‌ పదవి రావడం లేదనే సమాచారంతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి అసంతృప్తితో దోమలగూడలోని తన తల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఎంపీ సంతోష్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత, టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ కేకే, మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ ఆమెకు ఫోన్‌ చేశారు.  
►సుమారు పది నిమిషాల పాటు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మేయర్‌ ఎన్నిక సమయంలోగా ఆమె తిరిగి వచ్చారు. ఈ మాత్రం దానికి అలగడం ఎందుకు.. తిరిగి రావడం ఎందుకంటూ బీజేపీ సభ్యులు మాట్లాడుకోవడం వినిపించింది. 
►మేయర్‌ ఎన్నికకు మద్దతుగా టీఆర్‌ఎస్‌కు సభ్యులు చేతులెత్తి ఓట్లు వేయడంతో బీజేపీ సభ్యుల అరుపులతో  ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. 
►ఓ పక్క మంత్రి కేటీఆర్‌ మజ్లిస్‌తో పొత్తు ఉండదని చెబుతూనే ఇక్కడ మాత్రం కవిత, ఎంపీ సంతోష్‌లు పొత్తు కుదుర్చుకుని, ఏ రకంగా నీతి మాటలు మాట్లాడతారంటూ ఎన్నిక ముగిశాక పలువురు  మీడియాతో మాట్లాడారు

.  
►మేయర్‌ ఎన్నికకు ముందే హాల్‌ వెలుపలకు వచ్చిన కొందరు ఎంఐఎం సభ్యులు ఏం చేద్దాం.. అధిష్టానం  చెప్పినట్లు మనం వినాల్సిందేగా.. హ్యాండ్స్‌ రేజ్‌ చేద్దామంటూ మాట్లాడుకున్నారు. 
►ఎన్నిక పూర్తయ్యాక బయటకు వచ్చిన ఎంఐఎం సభ్యులను పలకరిస్తూ మీడియా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని మీ అధినాయకులు చెప్పారని గుర్తుచేయగా, మాకు పర్సనల్‌ ఇంట్రస్ట్‌ ఉండదు కదా.. అంటూ  వెళ్లిపోయారు.  
►కాంగ్రెస్‌ కార్పొరేటర్లు రజిత, సింగిరెడ్డి శిరిషా రెడ్డిలు ప్రమాణ స్వీకారం ముగియగానే బయటకు వచ్చారు.  
►సీఎం కేసీఆర్‌ చీకటి ఒప్పందాలకు తెరతీశారంటూ ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాతో.. ఇక్కడ మజ్లిస్‌ స్నేహాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు హైడ్రామా క్రియేట్‌ చేశారన్నారు.  
►టీఆర్‌ఎస్, ఎంఐఎం పొత్తుపై ఎమ్మెల్సీ కవితను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఇద్దరు మహిళలు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉందంటూ సమాధానాన్ని దాటవేశారు. జైతెలంగాణ నినాదాలు చేసుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి కార్పొరేటర్లతో కలిసి వెళ్లారు.  
►డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత ఎన్నిక కావడంతో ఆమె కుమార్తె తేజస్వి భావోద్వేగానికి గురయ్యారు. హాలు నుంచి బయటకు వచ్చిన తల్లిని హత్తుకుని విషెస్‌ చెప్పారు. తల్లిని కిస్‌ చేస్తూ మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ అంటూ ఎగిరి గంతేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top