కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో మాయ అమాయకుల ఖాతాలు ఖాళీ!

Innocent losing Cyber‌ crimes Telangana police awareness - Sakshi

రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు 

మోసపోతున్న వారిలోచదువుకున్న వారే అధికం 

అంతర్‌‘జాలం’ మాయగాళ్లకు చిక్కుకుని అమాయక జనులు విలవిల్లాడుతున్నారు. దుండగులు ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి నెట్టింటి వేదికపై విసిరిన వలలో పడి ఎంతోమంది తమ ఖజానాను గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఔను.. రెండు మూడు నెలలుగా సైబర్‌ నేరగాళ్ల మాయాజాలంలో మోసపోయిన కేసులు అధికమయ్యాయి. ఒకప్పుడు డైరెక్ట్‌ దొంగతనాలకు తెగపడే సంఘటనలు ఉంటే.. ఇప్పుడు కనిపించని అంతర్జాలంలో వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను రాబట్టి మరీ దర్జాగా స్వాహా చేసేస్తున్నారు.   – సనత్‌నగర్‌

సీసీ కెమెరాలు, పోలీసుల భద్రత వ్యవస్థ పటిష్టంగా తయారవడంతో దొంగలు ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేసే సంఘటనలు తగ్గిపోయాయి. ఇప్పుడు సైబర్‌ నేరాలు చేసేవారు అధికమయ్యారు. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని పట్టుకుని రివకరీ చేయడం పోలీసులకు సైతం కష్టసాధ్యంగా మారింది. మోసపోతున్న వారిలో ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారే ఉండడం గమనార్హం. కేసులు పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతోనైనా చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

⇒ ఒకప్పుడు సైబర్‌కు సంబంధించిన ఎలాంటి నేరం జరిగినా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ విభాగానికి వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేంది. ఈ క్రమంలో చాలామంది దూరభారంతో ఫిర్యాదుకు వెనుకడుగు వేసేవారు. 
⇒ ఇప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లలోనే సైబర్‌ వింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా ఏప్రిల్‌ నుంచి సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సైతం ప్రత్యేక సైబర్‌ విభాగాన్ని ఏర్పాటుచేసి సైబర్‌ నేరగాళ్ల బారిన పడ్డ బాధితుల ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. 
⇒ గడిచిన నాలుగు నెలల్లో సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సైబర్‌ విభాగంలో 51 కేసులు నమోదు కాగా రెండు కేసులను మాత్రమే చేధించగలిగారంటే సైబర్‌ నేరాల ఛేదన ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఎక్కువగా నమోదవుతున్న కేసులు ఇవే..
⇒ గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం వెతికారంటే సైబర్‌ నేరగాళ్లకు దొరికిపోతున్నారు. నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఇలాంటి కేసులే. 
⇒ ఓఎల్‌ఎక్స్, ఫేస్‌ బుక్‌లో.. ఇంట్లోని పాత సామగ్రి, ద్విచక్ర వాహనం.. ఇలా ఏదైనా విక్రయాని కి, ఇల్లు అద్దెకిస్తామని ప్రకటన పోస్ట్‌ చేశారంటే సైబర్‌ నేరగాళ్ల నుంచి వెంటే ఫోన్‌ వచ్చేస్తుంది. 
⇒ తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ప్రకటనలు చూసి     మోసపోతున్న వారు అధికంగా ఉన్నారు. 
⇒ ఉద్యోగం కోసం నౌకరీ.కామ్‌ లేదా పలు వెబ్‌సైట్లలో అన్వేషణ జరిపి సైబర్‌ నేరగాళ్లకు దొరికిపోయిన వారు కూడా ఉన్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. 
⇒ కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెబితే 25 లక్షల డబ్బు వస్తుందని ఆశ చూపి సులువైన ప్రశ్నలు అడిగి బుట్టలో వేసుకుంటున్నారు. ఆ తరువాత మీరు గెలుచుకున్న డబ్బు మీకు అందాలంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందని, అందుకు రెండు మూడు లక్షల పంపించాల్సి ఉంటుందంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. 
⇒ మిలటరీ దుస్తులతో ఉన్న గుర్తుతెలియని వ్యక్తుల ఫొటోలతో ఫేస్‌బుక్‌లో ద్విచక్ర వాహనం, కారు ఫొటోలను పోస్ట్‌ చేసి విక్రయిస్తామని ప్రకటన చూసి నమ్మి ఫోన్‌ చేసిన వారిని నిలువునా ముంచేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. 

అవగాహన అవసరం: ఉచితంగా ఏదీ రాదు. ఆన్‌లైన్‌లో అలాంటి ప్రకటనలు ఏవైనా ఉన్నాయంటే కాస్తా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్యాంకుకు సంబంధించిన వివరాలను ఫోన్‌లో బ్యాంక్‌ వారే అడగరు. అలాంటిది బయటి వ్యక్తులు అడిగారంటే అలెర్ట్‌ అవ్వాల్సిందే. మొబైల్స్‌కు వచ్చే లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వీలైనంతవరకు తెలియని వారు పంపించే లింక్‌లను ఓపెన్‌ చేయకుండా వదిలేస్తేనే బెటర్‌. సైబర్‌ నేరగాళ్లు లోకల్‌లో కాకుండా ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి మోసం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో రివకరీ చేయడం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, లింక్‌లు, కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండి మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఓటీపీలను చెప్పకుండా ఉంటే మేలు.    – ముత్తుయాదవ్, సనత్‌నగర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ 
జాగ్రత్తలు తప్పనిసరి..
 మీరు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. అందుకు పన్ను రూపంలో నగదు చెల్లించాలని అడిగితే మాత్రం నిర్మోహమాటంగా ఆ బహుమతిని నిరాకరించండి. 
 తక్కువ ధరకే వస్తువు ఇస్తామంటే మాత్రం గుడ్డిగా నమ్మేసి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపకుండా దాన్ని చూసి పరిశీలించిన తర్వాతనే డబ్బులు ఇస్తామని చెప్పండి. 
 ఉద్యోగం, ఉపాధి అంటూ ప్రకటనలు ఇస్తూ డబ్బులు అడుగుతున్నారంటే సందేహించాల్సి ఉంటుంది. 
⇒ పోన్‌ చేసిన వ్యక్తులు మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తుల పట్ల అనుమానించాల్సిన అవసరం ఉంది. 

అవగాహన కల్పిస్తున్న పోలీసులు
⇒ సైబర్‌ నేరాలను అరికట్టేందుకు పోలీసులు అవగాహనాస్త్రాన్ని సంధించారు. ఎక్కువగా చదువుకున్న వారే మోసపోతుండడంతో ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రతి మంగళవారం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 
⇒  ఎక్కువగా నేరాలు జరిగిన ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటుచేసి ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోకుండా ఎలా వ్యవహరించాలి అనే విషయాలను వివరిస్తున్నారు. 
     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top