
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో హరేకృష్ణ ఫౌండేషన్
సౌజన్యంతో భోజన పథకం
2014 నుంచి అమల్లో..
నిత్యం 30 వేల మంది ఆకలి తీరుస్తూ..
ఇప్పుడిక బ్రేక్‌ఫాస్ట్ సైతం తక్కువ ధరకే..
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఓవైపు కోటానుకోట్ల సంపదతో, ఆకాశహరామ్యల్లో నివసించే ఆగర్భ శ్రీమంతులతో పాటే కనీసం పూట భోజనానికి సైతం సరైన సంపాదన లేని వారూ ఉన్నారు. వారితోపాటు ఉన్నత చదువుల కోసం ఉన్న ఊళ్లను వదిలి వచి్చన విద్యావంతులు, ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వారూ, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కోసం వచ్చిన సహాయకులు, ప్రతిరోజూ పనులు దొరకని వివిధ రంగాల్లోని కార్మికులూ ఎందరో ఉన్నారు. ఇలాంటి వారందరికీ కనీసం ఒక్క పూటైనా ఆకలితీర్చే అమ్మలా ఆదుకుంది జీహెచ్‌ఎంసీ రూ.5కే భోజన పథకం.
11 ఏళ్ల క్రితం 2014 మార్చి 2న నాంపల్లి సరాయి వద్ద లాంఛనంగా ప్రారంభించిన రూ.5లకే భోజన పథకం పేరు రూ.5 లకే భోజన పథకంగా ఉన్నప్పటికీ, అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని అన్నపూర్ణ పథకంగా నామకరణం చేసింది. ఇప్పటి దాకా భోజనాన్నే అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్ కూడా అదే రూ.5లకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతోపాటే సరఫరా కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చి, సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పిస్తోంది. ఆహారం తయారీలో నాణ్యతతోపాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడంతో ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విజయవంతంగా కొనసాగుతోందీ కార్యక్రమం.
అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమం
ప్రభుత్వం ఏదైనా పథకాన్ని నిర్వఘ్నంగా కొనసాగిస్తున్నది జీహెచ్‌ఎంసీ కావడం విశేషం. మిగతా మునిసిపల్ కార్పొరేషన్లకు, జీహెచ్‌ఎంసీకి ఎంతో వ్యత్యాసం ఉంది. మిగతా కార్పొరేషన్లలో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉండగా, జీహెచ్‌ఎంసీ అందుకు భిన్నంగా కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పేదల ఆకలి తీర్చే ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తోంది.
ఇందిరమ్మ క్యాంటీన్లు ఇలా..
నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా సోమవారం రెండు ప్రారంభించారు. మరో పది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 50 రెడీగా ఉన్నప్పటికీ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ ఇతరత్రా సదుపాయాలకు మరో పది రోజుల సమయం పట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావీ దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు. గతంలో నిలబడే తినాల్సి వచ్చేది. కొన్నింట్లో మాత్రం కూర్చునే సదుపాయం కలి్పంచారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో అన్నింటిలోనూ కూర్చునే సదుపాయంతోపాటు హ్యాండ్‌వాట, తాగునీటి సదుపాయంతోపాటు విద్యుత్, డ్రైనేజీ కనెక్షన్లు కల్పిస్తున్నారు. నగరవ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటుకుగాను జీహెచ్‌ఎంసీ రూ.11.43 కోట్లు ఖర్చు చేయనుంది. లబి్ధదారులకు రూ.5లకే భోజనం అందిస్తున్నప్పటికీ, ఒక్కో భోజనానికి రూ. 29.83 ఖర్చవుతోంది. ఆమేరకు మిగతా వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ భరిస్తోంది. అలా ఇప్పటి వరకు అందజేసిన 12.30 కోట్ల భోజనాలకు జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచి రూ.253. 87 కోట్లు ఖర్చయింది. ప్రతిరోజూ సగటున 30 వేల భోజనాలు సరఫరా చేస్తూ ప్రజల ఆకలి తీరుస్తోంది.
మిల్లెట్ టిఫిన్స్..
ప్రజారోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా కూడా అందజేయనున్నారు.
సీఎం ఆదేశాల మేరకు..
పేదలకు ఒక్కపూట భోజనమే కాక, ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కూడా అందజేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాని కనుగుణగా జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక్కో ప్లేట్‌కు రూ.19 ఖర్చవుతుండగా, లబి్ధదారు చెల్లించే రూ.5పోను మిగతా రూ.14 జీహెచ్‌ఎంసీ ఖర్చు చేయనుంది. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీకి సంవత్సరానికి మరో రూ.12.60 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. ఈమేరకు గ్రాంట్స్ ఇవ్వాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది.