
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.