12 చోట్ల తనిఖీలు.. 1,950 కిలోల పదార్థాలు స్వాధీనం
12 నమూనాలు సేకరణ.. 5 సంస్థల లైసెన్సు రద్దు
మరో ఆరు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్: పేనీలు, ఖారా తదితర ఆహార పదార్థాల తయారీ, విక్రయ కేంద్రాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం కొరడా ఝళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 12 ప్రత్యేక బృందాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 12 తయారీ, రిటైల్ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి. పలు కేంద్రాల్లో అపరిశుభ్రత, మురికి నేలలు, జిడ్డు గోడలు, ఆహార పదార్థాలను నేలపైనే నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. పలుచోట్ల సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు హెయిర్‌నెట్లు ధరించకపోవడం, గుట్కా, పాన్‌మసాలా నమిలి అక్కడే ఉమ్మివేసిన ఆనవాళ్లు కనిపించాయని అధికారులు తెలిపారు.
లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు నాణ్యతపై అనుమానాల నేపథ్యంలో రూ.2.30 లక్షల విలువైన 1,950 కిలోల పేనీలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12 ఆహార నమూనాలను పరీక్షలకు పంపారు. అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో, అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 5 సంస్థలపై టీజీ సేఫ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న జియాగూడలోని అంజనీ ఫుడ్స్ అండ్ పేనీ వర్క్స్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. భరత్‌నగర్ కాలనీలోని శ్రీ గణేశ్ ఖారా అండ్ పేనీ, ఇమాంపురాలోని జేపీ ఫుడ్స్, చార్మినార్ పేట్లబురుజులోని ప్రేమ్‌పురీ స్వీట్ పాణీ షాప్, నాదర్‌గుల్‌లోని మహావీర్ నమ్కీన్, అత్తాపూర్‌లోని జీఎం మిక్చర్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ఫెయిల్!
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. శివరాంపల్లి జేపీ ఫుడ్స్, మధుబన్ కాలనీలోని జైపూర్ జోధ్‌పూర్ పేనీవాలా, మహబూబ్‌గంజ్‌లోని రామ్‌నివాస్ పూరీ స్వీట్ పేనీవాలా, బేగంబజార్‌లోని జీఎం మిక్చర్స్, జియాగూడలోని భగీరథ్ ఫుడ్స్, మూసారాంబాగ్‌లోని బాలాజీ పేనీ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. పలు కేంద్రాల్లో పెస్ట్ కంట్రోల్, సిబ్బంది ఆరోగ్య రికార్డులు నిర్వహించకపోవడం, ఆహార పదార్థాలు కలుషితం అయ్యేలా నిల్వ చేయడం వంటి లోపాలను కూడా అధికారులు గుర్తించారు. తదుపరి చర్యలతోపాటు జరిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.


