సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కలకలం.. రెండు లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం!

Hyderabad: Secunderabad Railway Station Damaged Protest Turns Violent Agnipath Scheme - Sakshi

సికింద్రాబాద్‌ ఉదంతంతో కలకలం 

రోజంతా టెన్షన్‌ టెన్షన్‌ స్తంభించిన ప్రజా రవాణా.. 

నిలిచిపోయిన రైళ్లు, బస్సులు 

సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద కొనసాగిన ఉత్కంఠ

ప్రయాణికులపై ఆటోవాలాల నిలువుదోపిడీ 

రైళ్ల రద్దుతో ప్రయాణికుల్లో అనిశ్చితి 

సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద పడిగాపులు 

టిక్కెట్‌ చార్జీల రీఫండ్‌ కోసం బారులు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఉదంతంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కపడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణక్షణం ఉత్కంఠతో నగరంలో ఒకరకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు రోజంతా స్టేషన్‌ లోపలే ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం ఆందోళనకు గురయ్యారు. టీవీలు, సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండిపోయారు. ఇక రాత్రి 7 గంటల వేళ ఆందోళనకారులను పోలీసులు తరలించడం...రైళ్ల రాకపోకలు పునరుద్ధరించడంతో ఊపిరి పీల్చుకున్నారు.  

ప్రజా రవాణా లేక
►  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజారవాణా స్తంభించింది.  
►    ఎంఎంటీఎస్‌ రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.  
►    మెట్రో రైళ్లను సాయంత్రం ఆరింటి వరకు నిలిపివేశారు.  
►    సికింద్రాబాద్‌ మీదుగా నడిచే వందలాది బస్సులు సైతం ఆగిపోయాయి. ఆందోళనకారులు పలు బస్సులపైన రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడడంతో ఆర్టీసీ అధికారులు సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగించే సుమారు 1000కి పైగా సిటీ బస్సులను నిలిపివేశారు.  
►    దీంతో  ఇటు బస్సులు, అటు రైళ్లు అందుబాటులో లేక లక్షలాది మంది ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు.  
►   ఇదే అదనుగా ఆటోవాలాలు ప్రయాణికులపైన నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. సికింద్రాబాద్‌ నుంచి జూబ్లీబస్‌స్టేషన్‌ వరకు రూ.150 నుంచి రూ.200 వరకు డిమాండ్‌ చేసినట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు.  
►    రైళ్ల రద్దు నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు పరుగులు తీశారు. ప్రైవేట్‌ బస్సుల కోసం కొంతమంది అమీర్‌పేట్, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లోని ట్రావెల్‌ ఏజెంట్‌లను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆటోలపైన ఆధారపడాల్సి వచ్చింది.  
►    రైళ్లు రద్దయిన సమాచారం తెలియక కొందరు, దారిమళ్లించిన రైళ్లు ఎక్కడి నుంచి బయలుదేరుతాయో తెలియక మరికొందరు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.  
►  దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చంటి పిల్లలు, లగేజీతో సహా వచ్చిన ప్రయాణికులు తిరిగి ఇళ్లకు వెళ్లలేక, రైళ్ల రద్దు సమాచారం తెలియక ఇబ్బందులకు గురయ్యారు.  

రెండు లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం 
సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లతో పాటు 65 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దయ్యాయి. ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మధ్య నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. అలాగే  ఈ ఘటన దృష్ట్యా ఎల్‌బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మధ్య నడిచే 57 మెట్రో రైళ్లు కూడా రద్దయ్యాయి.దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పని చేసే  ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన  సుమారు  45 వేల మంది  ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు, మరో లక్షన్నర మంది మెట్రో ప్రయాణికులు  ఇబ్బందులకు గురయ్యారు.

రీఫండ్‌ కోసం బారులు... 
రైళ్ల రద్దు, దారి మళ్లింపు వార్తల నేపథ్యంలో ప్రయాణికులు టిక్కెట్‌ చార్జీల రీఫండ్‌ కోసం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పెద్ద ఎత్తున బారులు తీరారు. సికింద్రాబాద్‌–దానాపూర్, సికింద్రాబాద్‌–భువనేశ్వర్, హైదరాబాద్‌–కాజీపేట్‌ (పుష్‌ఫుల్‌), సికింద్రాబాద్‌–మన్మాడ్‌ (అజంతా), సికింద్రాబాద్‌–రాయ్‌పూర్, సికింద్రాబాద్‌–తిరుపతి (సెవెన్‌హిల్స్‌), సికింద్రాబాద్‌–చిత్తాపూర్‌ తదితర రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు టిక్కెట్‌ రీఫండ్‌ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.  

కంటి ఆపరేషన్‌ కోసం వచ్చా.. 
కంటి ఆపరేషన్‌ కోసం హుబ్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చాను. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని శుక్రవారం డిశ్చార్జి అయ్యాను. హుబ్లీ వెళ్లేందుకు రిజర్వేషన్‌ చేయించుకున్నాను. రైళ్ల రద్దు ప్రకటనతో భయాందోళన చెందాను. మధ్యాహ్నం 2 తర్వాత నాంపల్లి స్టేషన్‌లోకి 
అనుమతించడంతో ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.  
– మంజునాథ, హుబ్లీ 

ప్రయాణం వాయిదా 
ఉపాధి కోసం నగరానికి వచ్చాను. శుక్రవారం సొంతూరు వెళ్లేందుకు హైదరాబాద్‌ స్టేషన్‌కు వచ్చాను. గోరఖ్‌పూర్‌ స్పెషల్‌లో వెళ్లాల్సి ఉండేది. రైళ్లు రద్దు అయిన విషయం తెలుసుకుని ప్రయాణం వాయిదా వేసుకున్నా.  
    – పంకజ్, ఉత్తర ప్రదేశ్‌ 

మెసేజ్‌ పంపారు... 
యశ్వంత్‌పూర్‌ వెళ్లేందుకు టికెట్‌ తీసుకున్నాం. కానీ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో గొడవలు జరుగుతున్నాయని తెలిసి ప్రయాణం మానేద్దాం అనుకున్నాం. ఇంటి వద్దే టీవీలో సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకున్నాం. ఈలోగా రైళ్లు నడుస్తున్నాయని మాకు మెసేజ్‌ వచ్చింది. వెంటనే రైల్వేస్టేషన్‌కు బయలుదేరి వచ్చాం. 
– నితిన్‌ జశ్వంత్‌ 

రిలీఫ్‌ అయ్యాం.. 
సిటీ నుంచి చెన్నై వెళ్లేందుకు ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నాం. ఉదయం నుంచి టీవీలో న్యూస్‌ చూశాం. రైళ్లన్నీ రద్దు చేశారని చెప్పారు. కానీ సాయంత్రం మెసేజ్‌ వచ్చింది. మళ్లీ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. దీంతో రిలీఫ్‌ అయ్యాం. తిరిగి జర్నీ స్టార్ట్‌. 
– ఉత్తమ్‌ దేవాసి, చెన్నై 

అన్ని దారులు మూసేశారు.. 
సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది. రైళ్లు రద్దయినట్లు తెలిసి నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుండి వెళ్లాలని నిర్ణయించుకున్నా. కానీ మెట్రో రైళ్లు రద్దు చేశారు. స్టేషన్‌లోని అన్ని దారులు 
మూసి వేశారు. చాలా ఇబ్బందికి గురయ్యాం. 
    – యు.నాగరాణి, విద్యార్థిని

డ్యూటీకి వెళ్లలే... 
ప్రతిరోజు మెట్రో రైలులో డ్యూటీకి వెళ్లేవాడిని. మెట్రో రైళ్లు రద్దు కావడం, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సిటీ బస్సులు కూడా ఆపేశారు. దీంతో డ్యూటీకి వెళ్లలేక పోయాను. ఆఫీసుకు లీవ్‌ ఇవ్వాలని కోరాను. చాలా అసౌకర్యానికి గురయ్యాను. 
    – మల్లేష్‌ యాదవ్, ప్రైవేటు ఉద్యోగి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top