Hyderabad RRR: ఆర్‌ఆర్‌ఆర్‌.. 320 కి.మీ.

Hyderabad Regional Ring Road To Be Constructed Around 320 KM Long - Sakshi

దేశంలోనే అతిపెద్ద రింగురోడ్డు ∙సగ భాగానికి మార్గం సుగమం 

నెల రోజుల్లో భూసేకరణ ప్రక్రియ 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద రింగ్‌రోడ్డుకు మార్గం సుగమమైంది. భాగ్యనగరం చుట్టూ దాదాపు 320 కి.మీ. చుట్టూ నిర్మించతలపెట్టిన హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లో ఉత్తర భాగానికి ఈ సంవత్సరమే మార్గం సుగమమైంది. 158.46 కి.మీ. పొడవైన ఈ భాగానికి తుది అలైన్‌మెంటు సిద్ధమైంది. మరో నెలరోజుల్లో భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌కు చెందిన కే అండ్‌ జే కన్‌స్ట్రక్షన్స్‌ కన్సెల్టెన్సీ ఆధ్వర్యంలో నాలుగు అలైన్‌మెంటు ఆప్షన్లు రూపొందగా.. అందులో జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆప్షన్‌–ఏను ఎంపిక చేసింది.

గతంలో అలైన్‌మెంటు రూపొందినప్పుడు కాళేశ్వరం నీటితో నింపే రిజర్వాయర్లకు ప్రణాళికలు లేవు. ఈ నేపథ్యంలో అలాంటి కాలువలు, చానళ్లు, జలాశయాలకు ఇబ్బందిలేకుండా ఆయా ప్రాంతాల్లో అలైన్‌మెంటును మళ్లిస్తూ కొత్త అలైన్‌మెంటును రూపొందించారు. దీనికే ఎన్‌హెచ్‌ఏఐ మొగ్గు చూపింది. నాలుగు వరసల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,512 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి–తూప్రాన్‌–గజ్వేల్‌–జగదేవ్‌పూర్‌–యాదాద్రి–భువనగిరి–చౌటుప్పల్‌ పట్టణాలను అనుసంధానిస్తూ ఈ రోడ్డు నిర్మాణం కానుంది.  

దక్షిణ భాగం కోసం కసరత్తు 
దాదాపు 180 కి.మీ. పొడవుతో రూపుదిద్దుకోవాల్సిన దక్షిణ భాగం రింగ్‌రోడ్డుకు సంబంధించిన అంశం కేంద్రప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే దక్షిణ భాగం మార్గంలో ప్రస్తుతం వాహనాల సంచారం తక్కువగా ఉందని ఇటీవల జాతీయ రహదారుల విభాగం అధ్యయనంలో తేలింది. ప్రత్యేకంగా ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించి సర్వే చేయించగా, దీని నివేదిక కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

వాహనాలు తక్కువగా ఉన్నప్పుడు నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌ వే తరహా రోడ్డు నిర్మాణం ఎంతవరకు ఉపయోగం అన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అయితే, ఒకసారి రింగ్‌ అలైన్‌మెంట్‌ సిద్ధమైతే.. ఆ రోడ్డు మీదుగా తిరిగే వాహనాల సంఖ్య ఉత్తర భాగం తరహాలోనే ఉంటుందని, పూర్తి రింగుగా ఈ రోడ్డు నిర్మితమైతేనే ఉపయోగం ఉంటుందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. దీనికి సానుకూలంగానే కేంద్రం పరిశీలిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top