Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో 

Hyderabad Metro trains To Start Services From morning 6AM - Sakshi

నేటి ఉదయం నుంచే సేవలు అమలు 

కేటీఆర్‌ సూచనలతో వేళల్లో మార్పులు 

చివరి రైలు మాత్రం రాత్రి 10.15 గంటలకే

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో వేళలు బుధవారం నుంచి ఉదయం 6 గంటలకే ప్రారంభం అయ్యాయి. ఉదయం వేళల్లో క్యాబ్‌లు, ఆటోల దోపిడీ నుంచి ఉపశమనానికి మెట్రో వేళలను మార్చాలని కోరుతూ ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ట్విట్టర్‌లో విన్నవించిన సంగతి విదితమే. దీంతో ఆయన ఏకీభవిస్తూ.. మెట్రో అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఆయన సూచనల మేరకు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి రైలు వేళలను మాత్రం మార్పు చేయకపోవడం గమనార్హం. ఈ రైలు ఒక చివరి నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి... రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానం చేరుతుందని ప్రకటించారు. 

బాలారిష్టాలు దాటనేలే..  
నగరంలో మెట్రో ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా బాలారిష్టాలను అధిగమించనేలేదు. ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌– ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం రూట్లలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లను నిలిపేందుకు ఉచిత పార్కింగ్‌ సదుపాయం లేకపోవడం, పలు చోట్ల పార్కింగ్‌ దోపిడీ నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆయా స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రయాణికులు ఆటోలు,క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది.  

వెంటాడుతున్న ఆర్థిక నష్టాలు..  
కోవిడ్, లాక్‌డౌన్, ఐటీ కంపెనీల వర్క్‌ ఫ్రం హోం తదితర కారణాలు మెట్రోను ఆర్థికంగా భారీగా దెబ్బతీశాయి. లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రోజుకు కనాకష్టంగా 2.5 లక్షలు దాటడంలేదు. 
► మరోవైపు నిర్మాణ సమయం పెరగడంతో వ్యయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర పెరిగినట్లు సమాచారం. నిర్మాణం సమయంలో రూపొందించిన అంచనాల ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు చేసిన వ్యయంలో 45 శాతం ప్రయాణికుల చార్జీలు, మరో అయిదు శాతం వాణిజ్య ప్రకటనలు, మరో 50 శాతం 
రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు.  
► ఈ మూడు అంశాల్లోనూ నిర్మాణ సంస్థ అంచనాలు తల్లకిందులు కావడంతో ఆర్థిక నష్టాలు తప్పడంలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను ఆదుకునేందుకు సాఫ్ట్‌లోన్‌ మంజూరు చేస్తామని సూచనప్రాయంగా ప్రకటించడంతోపాటు సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. కానీ.. రుణ మంజూలు, ఇతరత్రా ఆర్థిక సాయం అందించే విషయంలో స్పష్టత రాకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top