తండ్రి పెన్షన్‌ కోసం అంధ తనయుడి ప్రదక్షిణలు.. 11 ఏళ్లుగా

Hyderabad: Man Roaming Govt Office For His Father Pension - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు విభాగంలో డీఎస్పీగా సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేశారాయన. ఆ తర్వాత అనారోగ్యంతో కన్నుమూశారు కె.పాండు రంగారావు. తండ్రి పెన్షన్‌ నుంచి రావాల్సిన తన వాటా కోసం ఆయన కుమారుడు కె.రాఘవేంద్ర (గతంలో కెమికల్‌ రియాక్షన్‌తో రెండు కళ్లూ కోల్పోయాడు) పదకొండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పాటు రాష్ట్రపతి, గవర్నర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు గురువారం ప్రగతి భవన్‌ వద్దకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆయనను అడ్డుకున్న పోలీసులు పంజగుట్ట ఠాణాకు తరలించి కౌన్సెలింగ్‌ అనంతరం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర ‘సాక్షి’కి తన దయనీయ పరిస్థితులను ఇలా వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. 

’మా నాన్న పాండురంగారావు పోలీసు విభాగంలో సబ్‌– ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి డీఎస్పీ, ఏసీపీ హోదాలో పలు జిల్లాల్లో పనిచేశారు. 1986లో పదవీ విరమణ పొందారు. మా అమ్మ 1994లో చనిపోగా.. నాన్న అనారోగ్యంతో 2010లో కన్నుమూశారు. నేను చెన్నైలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ పని చేసేవాడిని. 2009లో కెమికల్‌ రియాక్షన్‌ కారణంగా రెండు కళ్లనూ కోల్పోయాను. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయన పెన్షన్‌లో 50 శాతం భార్యకు చెల్లించాలి. ఆమె కూడా లేని పక్షంలో వికలాంగులు, భర్తను కోల్పోయిన పిల్లలు ఉంటే వారికి 20 నుంచి 25 శాతం చెల్లించాలి. అంధుడిగా మారిన నేను.. మా తండ్రి పెన్షన్‌ నుంచి రావాల్సిన మొత్తం కోసం పదకొండేళ్లుగా పోరాటం చేస్తున్నాను.  

తోబుట్టువుల దయాదాక్షిణ్యాలతో.. 
ప్రస్తుతం నేను ఎల్బీనగర్‌లో నివసిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. భార్య దూరమైంది. ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరాలు చదువుతున్న పిల్లల ఆలనాపాలనా నేనే చూసుకోవాలి. నెలవారీ ఖర్చులతో పాటు పిల్లల చదువు కోసమూ తోబుట్టువులపై ఆధారపడ్డాను. నాకు రావాల్సిన పెన్షన్‌ కోసం సంబంధిత అధికారులను 2010లోనే సంప్రదించాను.  

మొత్తం 19 రకాలైన సర్టిఫికెట్ల కావాలంటూ సూచించడంతో అవన్నీ సేకరించి పదకొండేళ్ల క్రితం దరఖాస్తు చేశా. నలుగురు ఎస్పీలు, అయిదుగురు ఏసీపీలు, దాదాపు పది మంది ఇన్‌స్పెక్టర్ల వద్దకు వెళ్లి ఈ పత్రాలు సేకరించాను. అప్పటి నుంచి పెన్షన్‌ కోసం నగర పోలీసు కమిషనరేట్, డీజీపీ కార్యాలయం, ఏజీ ఆఫీస్, పెన్షన్‌ ఆఫీస్, కలెక్టరేట్‌ తదితర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. నా దీనావస్థను వివరిస్తూ ఇద్దరు రాష్ట్రపతులు (శీతాకాల విడిదికి వచ్చినప్పుడు), నలుగురు గవర్నర్లు, ఇద్దరు హోంమంత్రులకు వినతులు అందించినా ఇప్పటి వరకు ఫలితం లేకుండాపోయింది.   

సీఎంకు నివేదిద్దామంటే అవకాశం ఇవ్వట్లేదు
గడిచిన పదకొండేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తే ఇప్పటికి ఫైల్‌ నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్‌ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం అక్కడే ఆగిపోయింది. నా పరిస్థితిని వివరించి, న్యాయంగా నాకు రావాల్సిన పెన్షన్‌ ఇప్పించాలని కోరడానికి కొన్నేళ్లుగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతిసారీ పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. కనీసం నా అభ్యర్థనను కూడా సీఎం వరకు తీసుకువెళ్లట్లేదు’ అని రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top