సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలు ప్రారంభం

Hyderabad: Cyberabad Police Launch Traffic Task Force - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారం దొరికింది. గంటలకొద్దీ ట్రాఫిక్‌జాంలో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సేవలను సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి, డీసీపీ క్రైమ్స్‌ కల్మేశ్వర్‌ సింగేన్వర్, బాలానగర్‌ డీసీపీ సందీప్, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ అడిషినల్‌ డీసీపీ రియాజ్, ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఏసీపీ మట్టయ్య, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ హనుమంత రావు, ట్రాఫిక్‌ అడ్మిన్‌ బీఎన్‌ఎస్‌ రెడ్డి, ఐటీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, గచ్చిబౌలి ట్రాఫిక్‌ సీఐ నవీన్‌ కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్యామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ 

బైక్స్‌ ప్రత్యేకతలివే: 
ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కోసం ఆరు మోటార్‌ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్‌పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్‌ఫోర్స్‌ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్‌ఐ ర్యాంక్‌ అధికారి ఇన్‌చార్జిగా ఉంటారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ పని చేస్తుంది. ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌కు అందించిన బైక్‌లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్, డ్రంకెన్‌ డ్రైవ్‌ చెకింగ్‌ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్‌ కెమెరా, షోల్డర్‌ లైట్, మాన్‌ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్‌ జాకెట్, కళ్లద్దాలు, ఎల్‌ఈబా బాటన్‌ తదితర వస్తువులు ఉంటాయి. 

టాస్క్‌ఫోర్స్‌ ప్యాట్రోలింగ్‌ ఇక్కడే.. 
►మాదాపూర్‌ నుంచి ఐకియా రౌటరీ– లెమన్‌ ట్రీ– మైండ్‌ స్పేస్‌ 
►కేబుల్‌ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–45 – ఐటీసీ కోహినూర్‌ 

టాస్క్‌ఫోర్స్‌ విధులు ఏంటంటే.
ట్రాఫిక్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు వారి బైక్‌లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ (పీఏఎస్‌) ద్వారా ట్రాఫిక్‌ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్‌ అవర్స్‌లో ట్రాఫిక్‌ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పెట్రోలింగ్‌ తిరుగుతుంటాయి. ట్రాఫిక్‌ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్‌ చేయడం, నో పార్కింగ్‌ ప్లేస్‌లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి.

లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్‌ స్నాచింగ్‌లు జరిగినప్పుడు కంట్రోల్‌ రూమ్‌ నుంచి కాల్‌ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. ప్యాట్రోలింగ్‌ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదేని సమస్య వస్తే మీరు దగ్గరుండి సాయం చేస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top